టాలెంటెడ్ హీరో.. ఆ సినిమా మీదే ఆశలన్నీ

Update: 2016-06-07 11:30 GMT
ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు ఎం.ఎస్.రాజు. ఒక్కడు.. వర్షం.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్ ను తెలుగు ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపాడు రాజు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఆయన్ని ఆకాశం నుంచి నేలమీదికి తీసుకొచ్చేశాయి. రాజు బ్యాడ్ టైం నడుస్తున్న టైంలో ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి చేసిన ‘తూనీగ తూనీగ’ తీవ్రంగా నిరాశ పరిచింది.

తొలి సినిమా ఫ్లాపైనా సుమంత్ టాలెంట్ మాత్రం అందరికీ తెలిసిందే. క్లాస్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఏరికోరి అతణ్ని ఎంచుకుని చేసిన సినిమా ‘అంతకుముందు ఆ తరువాత’ సుమంత్ అశ్విన్‌ కు తొలి సక్సెస్ రుచి చూపించింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. లవర్స్.. చక్కిలిగింత.. కొలంబస్.. ఇలా వరుస ఫ్లాపులు ఎదుర్కొని బాగా డీలా పడిపోయాడు. ఇప్పుడతడి ఆశలన్నీ ‘రైట్ రైట్’ మీదే ఉన్నాయి.

ఈసారి ఇక్కడ కథలతో సాహసం చేయకుండా మలయాళంలో విజయవంతమైన ‘ఆర్డినరీ’ సినిమాను అరువు తెచ్చుకున్నాడు సుమంత్. ఈ చిత్రంలో మను దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పూజా జవేరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ తో పాటు ‘కాలకేయ’ ప్రభాకర్ హీరో స్థాయి పాత్ర వేశాడు. ప్రూవ్డ్ స్టోరీ కాబట్టి ఈసారి తనకు కచ్చితంగా సక్సెస్ వస్తుందన్న ఆశతో ఉన్నాడు సుమంత్. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News