కొత్త మలుపు తిరిగిన పద్మావత్ కథ

Update: 2018-01-18 11:20 GMT
విడుదలకు ఇంకా పది రోజులు కూడా లేని సమయంలో పద్మావత్ దర్శక  నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. సెన్సార్  సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఒక యుద్ధంగా సాగితే ఇప్పుడు దాన్ని అన్ని రాష్ట్రాల్లో విడుదల చేసుకోవడం అంతకు మించి అన్న చందంగా తయారయ్యింది. పేరు మార్చుకుని సెన్సార్ చెప్పిన షరతులు పాటించిన తరువాత కూడా రాజస్తాన్ - మధ్య ప్రదేశ్ - గుజరాత్ - హర్యానా రాష్ట్రాలు పద్మావత్ విడుదలపై నిషేధం విధించడంతో కోర్ట్ ను ఆశ్రయించిన  భన్సాలీ తనకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల సంతోషంగా ఉన్నాడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీమ్ కోర్ట్ రాష్ట్రాలు విడిగా సినిమాపై తమ ప్రాధాన్యతలను అనుసరించి నిషేధం విధించడం  కుదరదని, ముందు చెప్పినట్టుగానే అదే తేదికి విడుదలకు అడ్డంకులు సృష్టించే హక్కు ఎవరికి లేదని తీర్పు ఇస్తూ ఆ నాలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల  కావాల్సిందే అని తేల్చి చెప్పింది

ఇది ఆయా ప్రభుత్వాలకు మింగుడు పడటం లేదు. కర్ణి సేనను ప్రసన్నం చేసుకోవడం కోసం దాన్ని తమ రాష్ట్రంలో ఆడనివ్వమని హామీ ఇచ్చి ఇప్పుడు కోర్ట్ తీర్పుతో విడుదల  చేసే తీరాల్సిన  పరిస్థితి  రావడంతో ఖంగు తిన్న సర్కార్లు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరీ సినిమాను ఆడించాల్సి  ఉంటుంది. ఈ రోజు ఉదయమే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్ లో కాని పబ్లిక్ ఫంక్షన్ స్ లో కాని పద్మావత్ పాటలు వినిపించడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది సేపటికే  సుప్రీమ్ తీర్పు రావడం విశేషం.

అయినా ఇక్కడ భన్సాలీ సంబరపడడానికి ఏమి లేదు. సినిమా విడుదలైనా కర్ణి సేన ఆయా రాష్ట్రాల్లో దీన్ని సాఫీగా ఆడించే పరిస్థితులు లేవు. టికెట్లు కొని మరీ ప్రదర్శన ఆపివేయిస్తామనే హెచ్చరికలు  కూడా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో బ్యాన్ తీసేసినా సామాన్య ప్రేక్షకుడు ధైర్యంగా సినిమా హాల్  దాకా వెళ్ళడం అనుమానమే. తీర్పులు ఎలా ఉన్నా తమ మనోభావాలు  దెబ్బ తీస్తున్న పద్మావత్  ని అడ్డుకుని తీరతామని చెబుతున్న  కర్ణి ఇప్పుడు దీనికి ఎలా స్పందిస్తుందో  వేచి చూడాలి. జనవరి 25 పద్మావత్ విడుదల  వల్ల చెదురు మదురు సంఘటనలు జరిగే అవకాశం ఉందనే రిపోర్ట్స్  నేపధ్యంలో థియేటర్ల వద్ద  భద్రతను చూసుకునే ప్లాన్ లో ఉన్నారు పోలీసులు.
Tags:    

Similar News