సింగిల్ థియేట‌ర్లు మ‌టాష్‌

Update: 2018-11-07 04:52 GMT
ముందొచ్చిన చెవుల క‌న్నా.. వెన‌కాలొచ్చిన కొమ్ములు వాడి!! అన్న సామెత ఈ సంద‌ర్భానికి స‌రిగ్గా స‌రిపోతుంది. జ‌మానా కాలం ఆలోచ‌న‌ల‌కు చెల్లు చీటీ ఇచ్చి - కొంగొత్త ఆలోచ‌న‌ల‌తో బిజినెస్ వ‌ర‌ల్డ్ దూసుకుపోతున్నా ఇంకా పాత ప‌ద్ధ‌తినే అనుస‌రిస్తే క‌ష్ట‌మే. ముఖ్యంగా సినిమా థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌కు పై సామెత‌ వ‌ర్తిస్తుంది. ఇంత‌కాలం తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సింగిల్ థియేట‌ర్లు ఉన్నాయి? అంటూ లెక్క‌లు క‌ట్టే వాళ్లు... కానీ ఇక‌పై ఎన్ని క‌ళ్యాణ‌ మంట‌పాలు ఉన్నాయి..? అని లెక్క తేల్చాల్సిన స‌న్నివేశం సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే దాపురించ‌నుంద‌ని తెలుస్తోంది. గ‌త ఐదేళ్లుగా దీనిపై నిర్మాత‌ల్లో - ఎగ్జిబిట‌ర్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉన్నా సింగిల్ థియేట‌ర్ల‌ను నిల‌బెట్టే ప్ర‌య‌త్నం అయితే ఏదీ జ‌ర‌గ‌లేదన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. థియేట‌ర్ మెయింటెనెన్స్ సైతం క‌ట్టుకోలేని ధైన్యం త‌మ‌కు వ‌స్తోంద‌ని ఎగ్జిబిట‌ర్లు వాపోయిన సంద‌ర్భాలు ఎన్నెన్నో. టెక్నాల‌జీ అప్‌డేష‌న్ - క్యూబ్‌-యూఎఫ్‌ వో వంటి ఖ‌రీదైన వ్య‌వ‌స్థ‌ల్ని అడాప్ట్ చేసుకోవ‌డంలో ఎగ్జిబిట‌ర్లు (య‌జ‌మానులు) త‌డ‌బ‌డ్డారు. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి.

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై కంచె వేసి కార్పొరెట్ ఆటాడుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సింగిల్ థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకుని లీజుదార్లు ఓ ఆటాడుతున్నారు. దీనివ‌ల్ల మ‌ధ్య‌వ‌ర్తుల‌కు లాభాలు కానీ - థియేట‌ర్ య‌జ‌మానుల‌కు గిట్టేదేం లేదు. ఏళ్ల‌కు ఏళ్లు నిలువు దోపిడీకి గుర‌వుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఓవైపు మ‌ల్టీప్టెక్సులు దూసుకొస్తున్నాయి. ఈ వ్య‌వ‌స్థ ఇప్పుడు చిన్నా చిత‌కా టూటైర్ సిటీల‌కు విస్త‌రిస్తుండ‌డంతో అక్క‌డ సింగిల్ థియేట‌ర్లు మాయ‌మై ఆ స్థానంలో మ‌ల్టీప్లెక్సులు క‌నిపిస్తున్నాయి. అందుకే ఈ మ‌ల్టీప్లెక్సుల వెల్లువ‌లో సింగిల్ థియేట‌ర్లు మూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. జ‌నం చూపు మ‌ల్టీప్లెక్సుల వైపే..ఉండ‌డం, ఆలోచ‌న మార‌డం కూడా ఓ కార‌ణ‌మ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేట‌ర్ల‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక్క‌డ‌ ప‌ర్సంటేజ్ ప్రాతిప‌దిక‌న ఆడిస్తే కొంద‌రికి లాభం కొంద‌రికి ఖేదం.. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అగ్ర నిర్మాత‌లు ప‌ర్సంటేజ్ బేస్‌ లోనే ఆడించాలంటారు.. కానీ వాళ్ల‌లోనే వాళ్ల‌కు విభేధాలు ఉన్నాయి. కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ చేసేప్పుడు ప‌ర్సంటేజ్ విధానం గిట్టుబాటు కాద‌ని చెబుతారు. ఇక దీనిని బాగు చేయ‌డం ఎలా? అని ప్ర‌శ్నిస్తే అగ్ర‌నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ -``ప్ర‌స్తుతం సింగిల్ థియేట‌ర్లు చాలా క‌ష్టాల్లో ఉన్నాయి. మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్‌ కే జ‌నం ప‌ట్టంగ‌డుతున్నారు. అందుకే మండే నాటికి సింగిల్ థియేట‌ర్లు ఖాళీ అయిపోతున్నాయి. అయితే కేర‌ళ‌ - త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఏపీ - తెలంగాణ‌లోనూ అన్ని థియేట‌ర్ల‌లో ప‌ర్సంటేజీ వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయాలి. అప్పుడే సింగిల్ థియేట‌ర్లు బతికి బ‌ట్ట‌క‌డ‌తాయి. మల్టీప్లెక్సుల్లో 50శాతం అనుకుంటే - సింగిల్ థియేట‌ర్ల‌కు 60శాతం య‌జ‌మానికి ఇచ్చినా త‌ప్పేం లేదు. ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలోనే మ‌నం కూడా చేయాలి. కానీ దీనిని 90 శాతం మంది అంగీక‌రించినా - 10శాతం మంది వ్య‌తిరేకంగా ఉన్నారు`` అని తెలిపారు. వేగంగా విస్త‌రిస్తున్న మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్‌ కి యూత్ అల‌వాటు ప‌డ‌డం కూడా సింగిల్ థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కు పెను విఘాతంగా మారింద‌ని - ఏరియాని బ‌ట్టి ట్యాక్స్ ప‌ర్సంటేజ్ త‌గ్గింపుతో మ‌ల్టీప్లెక్సుల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News