పెద్ద సమస్యలేవీ లేవు -సురేష్‌ బాబు

Update: 2015-07-24 17:14 GMT
ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక సినిమా పరిస్థితేంటి? విభజన ప్రభావం ఎంతవరకూ ఉంది? ఇవే ప్రశ్నల్ని ప్రస్తుత తెలుగు ఫిలింఛాంబర్‌ నూతన అధ్యక్షులు డి.సురేష్‌ బాబుని అడిగితే ఇదిగో ఇలా చెప్పారు...

=చిన్న చిన్న సమస్యలు తప్ప.. ఊహించినంత వేరే పెద్ద సమస్యలేవీ రాలేదు. రెండు చోట్లా పన్ను విధానం ఒకటే. కొత్త పన్ను విధానం లేదు. కాబట్టి సమస్యేం లేదు. అయితే ఎఫ్‌ డిసి తెలంగాణకి మాత్రమే ఉంది, ఏపీకి లేదు అంతే. అయితే ఎప్పుడూ ఉండే సమస్యలే పంటి కింద రాయిలా తగుల్తున్నాయి.

= ఇంతకుముందు డిజిటలైజేషన్‌ కాకముందు రీలుతో సినిమాలు తెరకెక్కేవి. అప్పుడు 30 ప్రింట్ల లోపు సినిమాలు అయితే లోబడ్జెట్‌ సినిమాలుగా పరిగణించేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా డిజిటలైజేషన్‌ అయిపోయింది. కాబట్టి 100 నుంచి 150 ప్రింట్ల్ల వరకూ లో బడ్జెట్‌ సినిమాగానే పరిగణించాలన్న ప్రపోజల్‌ ఉంది. చిన్న సినిమాలకు సబ్సిడీ విషయంపై సీరియస్‌ గా చర్చించనున్నాం.

= తెలంగాణ సినిమా, ఆంధ్రా సినిమా అన్న తేడాలేం లేవు. మార్కెటింగ్‌ చేసేవాళ్లకు అది సంబంధం లేదు. అయితే నావరకూ ఎగ్జిబిటర్‌, పంపిణీదారులు,  నిర్మాతలు .. అందరికీ మేలు చేసేలా కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంది. మారుతున్న ట్రెండ్‌ ను, టెక్నాలజీని అనుసరించి ఈ మార్పు తేవాలి.

=బాహుబలి చిత్రంతో మన సినిమా రేంజెంతో ప్రపంచానికి తెలిసింది. మనకి మార్కెట్‌ పరిధి ఎంతైనా ఉంది. కాకపోతే ఆ రేంజు సినిమాలు తీయాలి అంతే. మంచి ఉత్పత్తి, మంచి మార్కెటింగ్‌ ఇదే నా విధానం. బాహుబలి రేంజు మార్కెట్‌ ని క్రియేట్‌ చేసే పరిశ్రమని చూడాలన్నదే నా లక్ష్యం. అది ఇప్పటికి సాధ్యమైంది.

=చిన్న సినిమాలు కేవలం సబ్సిడీతోనే నిలబడలేవు. పన్ను మినహాయింపులు కూడా రావాలి. అయితే సబ్సిడీ కేవలం ఓ భాగం మాత్రమే. ప్రభుత్వం నుంచి సరైన సాయం అందాల్సి ఉంటుంది. సెంట్రల్‌ టాక్స్‌ తగ్గింపు అనే విషయం కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది.

=ప్రస్తుతం షూటింగ్‌ లొకేషన్‌ కి పర్మిషన్‌ కావాలంటే సింగిల్‌ విండో సిస్టమ్‌ రాలేదు. దానికోసం ప్రభుత్వాన్ని సంప్రదించనున్నాం. అలాగే లొకేషన్‌ కోసం బాదే చార్జీలు మనకు బాగా ఎక్కువ. అవి తగ్గించేందుకు ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉంది.

=తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వ్యాపారం స్థాయి రూ.1500 కోట్లు. దీనికంటే టెలివిజన్‌ మార్కెట్‌, ఎంఎస్‌ ఓ మార్కెట్‌ చాలా పెద్దది. కానీ అందరి దృష్టి సినిమాపైనే. ఎందుకంటే ఇక్కడున్నంత గ్లామర్‌ వేరే చోట ఉండదు.

Tags:    

Similar News