టిక్కెట్టు కోత‌తో థియేట‌ర్ల‌కు ర‌ప్పించేస్తారా?

Update: 2020-04-12 05:12 GMT
క‌రోనా పాఠాలపై జోరుగా విశ్లేష‌ణ సాగుతోంది. ప్ర‌పంచానికి క‌నువిప్పు క‌లిగించేందుకు పుట్టుకొచ్చిన వైర‌స్ ఇద‌న్న ముచ్చ‌ట‌ వినిపిస్తోంది. మాన‌వాళి ధ‌న‌దాహానికి అతికి విరుగుడుగా క‌రోనా పుట్టింద‌న్న వాదనా తెర‌పైకొచ్చింది. పెరుగుట విరుగుట‌కై! అంటూ కొంద‌రు న‌సిగేస్తున్నారు. ఏదేమైనా క‌రోనా ప్ర‌భావం అన్ని రంగాల‌పైనా ప‌డిన‌ట్టే సినీప‌రిశ్ర‌మ‌పైనా దారుణంగా ప‌డింది. లాక్ డౌన్ల ప్ర‌భావం థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పైనా తీవ్రంగా ప‌డింది.

ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసినా జ‌నం క‌రోనా భ‌యంతో థియేట‌ర్లకు వ‌స్తారా రారా? అన్న భ‌యం సినీప్ర‌ముఖుల్ని వెంటాడుతోంది. అస‌లు జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మెలా?  ఈ రెండు మూడునెల‌ల్లో థియేట‌ర్లు తెరుచుకున్నా మ‌హ‌మ్మారీ భ‌యాన్ని జ‌నం నుంచి త‌రిమేయ‌డం ఎలా? అంటూ విశ్లేషిస్తున్నార‌ట‌. ముఖ్యంగా జ‌నాన్ని థియేట‌ర్ల‌కు  రప్పించేందుకు ఆ న‌లుగురు లేదా ఆ ప‌ది మంది యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ స‌భ్యులు కాస్త తీవ్రంగానే యోచిస్తున్నార‌ట‌. తిరిగి య‌థావిధిగా సినిమాల్ని ఆడించాలంటే ... ఇప్పుడున్న స‌న్నివేశంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

క‌రోనా భ‌యం ఉంటుంది కాబ‌ట్టి ప‌క్క‌ప‌క్క‌నే ప్రేక్ష‌కులు అంటుకుని కూచోకుండా ప్ర‌తి ఇద్ద‌రి మ‌ధ్యా ఒక కుర్చీని లాక్ చేసేస్తార‌ట‌. దాని సంగ‌తి అటుంచితే.. రూ.200-300 వ‌ర‌కూ టిక్కెట్లు ధ‌ర‌లు చెల్లించి జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చే సీనుందా ఇప్పుడు? అంటే స‌సేమిరా అని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఎంద‌రో ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు మూసేశారు. ఎంద‌రో దివాళా తీసారు. ఈఎంఐ లు క‌ట్ట‌లేని ధైన్యం నెల‌కొని ఉంది. ఇలాంటి స‌న్నివేశంలో లాక్ డౌన్ ఎత్తేసేది ఎప్పుడో తిరిగి ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునేది ఎప్పుడో?   పోగొట్టుకున్న ఉద్యోగాల్ని తిరిగి తెచ్చుకునేదెలానో తెలియ‌క నానా హైరానా పడిపోతున్నారు. ఇలాంట‌ప్పుడు వినోదం కోసం పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసే ప‌రిస్థితి ఉంటుందా? అంటే ఛాన్సే లేదు.  అస‌లే బ‌తికుంటే బ‌లుసాకు అయినా తిని బ‌తికేస్తాం! అనేంత‌గా జ‌నం వైర‌స్ కి భ‌య‌ప‌డి చ‌స్తున్నారు. అందుకే ఆ భ‌యాన్ని త‌రిమేసే ఎత్తుగ‌డ‌లు ఏం ఉన్నాయో ఆలోచిస్తున్నార‌ట. ‌ఎలాగోలా థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు టిక్కెట్టు ధ‌ర‌ను సగానికి స‌గం త‌గ్గించాల‌ని అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన డి.సురేష్ బాబు ప్ర‌తిపాదిస్తున్నార‌ట‌. అది కూడా ఉద‌యం ఆట .. మ్యాట్నీకి అమ‌లు చేయాల‌ని కోరార‌ట‌. అయితే దీనికి అంద‌రు నిర్మాత‌లు అంగీక‌రిస్తారా?  త్వ‌ర‌లో రిలీజ్ కి రానున్న సినిమాల‌కు ఇలా చేస్తారా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. క‌రోనా క‌ల్లోలం మ‌రో ఏడాది వ‌ర‌కూ జ‌నాల మాన‌సిక ప‌రిస్థితిని ప్ర‌భావితం చేస్తే అప్ప‌టివ‌ర‌కూ వినోద ప‌రిశ్ర‌మ సీన్ ఇలానే వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నే అంతా ఆశిస్తున్నారు.


Tags:    

Similar News