సూర్య 'ఆకాశం నీ హద్దురా' న్యూ అప్డేట్...!

Update: 2020-07-19 10:56 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూరారై పొట్రు'. 'గురు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా   తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదలకానుంది. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న 'ఆకాశం నీ హద్దురా' సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కటింగ్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా తాజాగా ఈ సినిమాకి సంభందించిన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. జీవీ ప్రకాష్ స్వరపరిచిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాలోని 'కాటుక కనులే..' అనే సాంగ్ 1 నిమిషం వీడియో జూలై 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాటని ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ దీక్షిత (దీ) ఆలపించారు.

ఇదిలా ఉండగా 'కలలు కనడం మానవ సహజం.. వాటిని సాకారం చేసుకోవడం కష్టం.. తాము కన్న కలల్ని సాకారం చేసుకుని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలి' అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్‌ లోనే రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల వల్ల విడుదల వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరిచేదాకా వెయిట్ చేస్తారా లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. గత కొంత కాలంగా వరస పరాజయాలను ఎదుర్కొంటున్న సూర్యకు ఈ సినిమా విజయం కీలకం కానుంది.
Tags:    

Similar News