సుశాంత్ - దిశా సూసైడ్ కేసులపై వస్తున్న మీడియా కథనాలతో నిజమెంత...?

Update: 2020-08-06 08:50 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసు మిస్ట‌రీ థ్రిల్లర్ ని తలపిస్తూ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్ చేసుకొని మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో బలవన్మరణం పొందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. ఈ కేసుని దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిన ముంబై పోలీసులు పలువురు బాలీవుడ్ ప్రముఖులను సుశాంత్ తో సన్నిహితంగా ఉండేవారిని విచారించారు. అయితే సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం వెన‌క నిజానిజాలేమిటి? అన్న‌ది పోలీసులు తేల్చ‌లేదు. సుశాంత్ ది ఆత్మ‌హ‌త్య అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ప్ర‌క‌టించినా.. ఆ త‌ర్వాత ద‌ర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలు ఎన్నో సందేహాల‌కు తావిస్తోంది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంతో ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి.

కాగా సుశాంత్ మరణించినప్పటి నుంచి జాతీయ మీడియా ఛానల్స్ లో దీనిపై అనేక కథనాలు ప్రసారం అవుతూ వస్తున్నాయి. ఓ మీడియా ఛానల్ సుశాంత్ కేసుపై ద్రుష్టి పెట్టి మొదటి నుంచి విచారణ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో సుశాంత్ సూసైడ్ కేసుకి దిశా ఆత్మహత్యకి ఏమైనా సంబంధం ఉందా?.. సుశాంత్ సూసైడ్ లో అతని గర్ల్ ఫ్రెండ్ పాత్ర ఉందా? అనే కోణంలో వారితో పరిచయం ఉన్నవారిని.. స్నేహితులను.. దగ్గరి బంధువులను విచారిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా పలు స్ట్రింగ్ ఆపరేషన్స్ నిర్వహించి సుశాంత్ స్టాఫ్ మరియు పనివాళ్ళు.. ఫిట్నెస్ ట్రైనర్ నుంచి అనేక విషయాలు రాబట్టింది. ఈ క్రమంలో దిశా చనిపోకడానికి ముందు సుశాంత్ కి కాల్ చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిందని.. దీనిపై సుశాంత్ మీడియాకి వివరాలు అందించాలనుకున్నారని.. అంతలోనే దిశాతో పాటు సుశాంత్ కూడా మృతి చెందాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దిశా మరియు సుశాంత్ సింగ్ లను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు మీడియా ఛానల్ లో వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ కేసులో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ప్రమేయం కూడా ఉందనే వార్తలు రావడం క‌ల‌క‌లం రేపింది. దీనికి తోడు దిశ సలియాన్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని పలువురు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే మరోవైపు మీడియాలో వస్తున్న వార్తలను.. పలువురు ప్రముఖులు తన కూతురు దిశా మరణంపై చేస్తున్న కామెంట్స్ ని దిశా తండ్రి ఖండిస్తున్నారు. దిశా అత్యాచారానికి గురైంద‌ని.. హ‌త్య చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఏ నిజం లేదని.. ఇవ‌న్నీ మీడియా క‌ట్టుక‌థ‌లు అంటూ దిశా తండ్రి పోలీసుల‌కు ఒక లేఖ రాశారు.

మీడియా వేధింపులకు గురి చేస్తోందని.. రాజ‌కీయ నాయ‌కులు మీడియా ప్రముఖులు చర్చల పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ముంబై పోలీసులపై విశ్వాసాన్ని పదేపదే ప్రశ్నిస్తూ మీడియా వారు ఎంక్వైరీ చేయడం తగదని.. ఇప్పటికే ఈ కేసులో ఎవరిపైనా అనుమానం లేదని పోలీసులకు మా స్టేట్మెంట్ ఇచ్చామని.. మాపై అనాలోచిత చర్యలకు పాల్పడిన సంబంధిత జర్నలిస్టులు రాజకీయ నాయకులు మరియు మీడియా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా దిశా తండ్రి కోరారు. అయితే సదరు మీడియా ఛానల్ వారు మాత్రం ముంబై పోలీసుల దర్యాప్తుకి.. వారి విచారణలో బహిర్గతం అవుతున్న విషయాలకు పొంతన లేదనే విధంగా కథనాలు వెలువరిస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ వేయడంతో నిజానిజాలు బయటపడే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు.
Tags:    

Similar News