బిగ్ బాస్ పంచాయితీ.. దిల్లీ లెవల్లో ప‌రువు తీశారు!!

Update: 2019-07-18 15:52 GMT
గ‌ల్లీ నుంచి దిల్లీ వ‌ర‌కూ బిగ్ బాస్ ప్రాభ‌ల్యం ఎంత‌గా పాకిపోయిందో.. వేధింపుల ప్ర‌హ‌స‌నంలోనూ ఈ రియాలిటీ షోకి అంతే పాపులారిటీ ద‌క్కుతోంది. జాతి ప‌రువు తీసి పందిరేయ‌డంలోనూ ఈ షో ముందుంటోంది. ముఖ్యంగా దేశంలో ఏ ప‌రిశ్ర‌మ‌లో లేనంత‌గా తెలుగు బిగ్ బాస్ వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజ‌న్ 3 ప్రారంభం కాక‌ముందే కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం కుదిపేస్తోంది. ఓ వైపు పోలీస్ కేసులు.. మ‌రోవైపు మ‌హిళా క‌మీష‌న్ లో ఫిర్యాదులు.. హెచ్ ఆర్సీ.. మానవ హ‌క్కుల సంఘాలు అంటూ ఒక‌టే హ‌డావుడి సాగుతోంది. ఇప్పుడు ఏకంగా దిల్లీ గ‌డ‌ప వ‌ర‌కూ ఈ వివాదం రాజుకుపోవ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్ రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన యాంక‌ర్ శ్వేతారెడ్డి .. గాయ‌త్రి గుప్తా .. నేడు నేరుగా దిల్లీ వెళ్లి జాతీయ మ‌హిళా క‌మీష‌న్ ని ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఫిర్యాదును స్వీక‌రించిన జ‌తీయ మ‌హిళా క‌మీష‌న్ త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఆ మేర‌కు శ్వేతారెడ్డి మీడియాకు ఆ సంగ‌తిని తెలిపారు. మ‌రోవైపు ఓయూ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేస్తూ ఈ షోని నిలిపేయాల్సిందిగా కోరింది. అలాగే టాలీవుడ్ నిర్మాత కేతిరెడ్డి ఇప్ప‌టికే బిగ్ బాస్ రియాలిటీ షోను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో కేసు వేయ‌డం సంచ‌ల‌న‌మైంది. యువ‌త‌ను చెడు దారి ప‌ట్టించే ఈ షోపై ఇప్ప‌టికే ప‌లువురు గ‌రంగ‌రంగా ఉన్నారు.

తాజాగా వేధింపుల ప్ర‌హ‌స‌నంపై పెద్ద ఎత్తున డిబేట్ ర‌న్ అవుతోంది. అవ‌కాశాల పేరుతో లైంగిక వేధింపులకు పాల్ప‌డ‌డం.. అలాగే పాశ్చాత్య ధోర‌ణి పెచ్చురిల్ల‌డం అన్న టాపిక్ తో బిగ్ బాస్ పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే బోలెడంత నెగెటివిటీ ప్ర‌చార‌మైంది. కేవ‌లం విదేశాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన అదో ర‌క‌మైన‌ నీచ‌మైన క‌ల్చ‌ర్ ని తెలుగు రాష్ట్రాల‌కు తెస్తారా? అంటూ సంప్ర‌దాయ వాదులూ మండిప‌డుతున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి ముంబైకి .. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ కి లైంగిక వేధింపుల క‌ల్చ‌ర్ ని ఇంపోర్ట్ చేస్తున్నార‌న్న నింద‌ వేడెక్కిస్తోంది. ఈ స‌న్నివేశం చూస్తుంటే సీజ‌న్ 3 విష‌యంలో అస‌లేం జ‌ర‌గ‌బోతోంది? అన్న సందేహాలు ముసురుకున్నాయి. ఇంత‌కీ నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన `బిగ్ బాస్ 3` మొద‌లవుతుందా లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News