బాహుబలి-2 రికార్డు ఇలా బద్దలైంది

Update: 2019-10-04 10:05 GMT
ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని అనూహ్యమైన స్థాయికి విసర్తించింది ‘బాహుబలి’. 500-600 కోట్ల కలెక్షన్ లకే అబ్బురపడిపోతున్న బాలీవుడ్ వాళ్లకు దిమ్మదిరిగిపోయేలా చేస్తూ ఏకంగా ‘బాహుబలి-2’ రూ.1750 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ‘దంగల్’ సినిమాకు అనుకోకుండా చైనాలో క్రేజ్ రావడం వల్ల అక్కడో 1200 కోట్ల దాకా కొల్లగొట్టి మొత్తంగా రూ.2000 కోట్ల మార్కును టచ్ చేసింది కానీ.. లేదంటే ‘బాహుబలి-2’ని సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా టచ్ చేసేది కాదు. క్రేజ్ - దేశీయ వసూళ్ల పరంగా ‘బాహుబలి’ని సమీప భవిష్యత్తులో ఇంకే సినిమా కూడా అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్‌ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో అనుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.

‘బాహుబలి-2’ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్‌ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బద్దలు కాదనే అనుకుంటున్నారంతా. రాజమౌళి తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ అయినా దీన్ని దాటడం కష్టమే కావచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు ఇందులో సగం కలెక్ట్ చేయడానికి కూడా కష్టపడిపోతున్నాయి. ఇక ఒక్క రోజులో వంద కోట్ల మార్కును ఎలా అందుకుంటాయి? ఐతే ‘బాహుబలి-2’ రికార్డు మరో రకంగా బద్దలైందిప్పుడు. గాంధీ జయంతి కానుకగా ఇండియాలో రిలీజైన మూడు సినిమాలు కలిపి తొలి రోజు బాహుబలి-2 సాధించిన నెట్ వసూళ్లను అధిగమించాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ఇండియాలో రూ.60 కోట్ల దాకా నెట్ వసూళ్లు చేస్తే.. ‘వార్’ రూ.50 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. హలీవుడ్ మూవీ ‘జోకర్’ సైతం మంచి ఓపెనింగ్సే సాధించింది. ఈ మూడు కలిపి రూ.120 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క రోజులో అత్యధిక వసూళ్ల రికార్డు 2017 ఏప్రిల్ 28న (బాహుబలి-2’ పేరిట ఉన్నాయి. ఇప్పుడు 2019 అక్టోబరు 2 (సైరా - వార్ - జోకర్) రికార్డును సొంతం చేసుకుంది.



Tags:    

Similar News