హీరోయిన్ పై టి. రాజేంద‌ర్ వీరంగం!

Update: 2017-09-29 11:47 GMT
సినిమా ఫంక్ష‌న్లు - మీడియా స‌మావేశాల‌లో సినీ ప్ర‌ముఖులు ప్ర‌సంగించేట‌పుడు కొన్నిసార్లు పొర‌పాటున స‌హ‌న‌టుల పేర్లు మ‌ర‌చిపోవ‌డం స‌హ‌జం. స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో ఆ చిత్ర హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరును ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ - ప్రిన్స్ మ‌హేష్ బాబు ఇద్ద‌రూ మ‌ర‌చిపోయారు. వెంట‌నే తాము చేసిన పొర‌పాటును గ్ర‌హించి వెన‌క్కు వ‌చ్చి ర‌కుల్ గురించి మాట్లాడారు. ర‌కుల్ కూడా ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంది. అయితే, కోలీవుడ్ లో ఈ త‌ర‌హా ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. కానీ, రిజ‌ల్ట్ మాత్రం నెగెటివ్ గా ఉంది. ఓ మీడియా స‌మావేశంలో ప్రముఖ నటుడు - దర్శకుడు టి. రాజేందర్ పేరును క‌బాలి ఫేం ధ‌న్షిక ప్ర‌స్తావించ‌లేదు. దీంతో, ధ‌న్షిక‌పై టి.రాజేంద‌ర్ శివాలెత్తిపోయారు. ‘విళితిరు'  సినిమాకు సంబంధించిన‌ మీడియా సమావేశాన్ని చెన్నైలో నిర్వహించారు. ఆ సినిమాలో ధన్షిక హీరోయిన్ గా నటించ‌గా, టి.రాజేంద‌ర్ ఒక పాట పాడారు. ధ‌న్షిక ఆ సినిమా గురించిన‌, అందులో పని చేసిన వారి గురించి ప్ర‌సంగించింది. పొర‌పాటున రాజేందర్ పేరు మరచిపోయింది. ఆ పేరును ప్ర‌స్తావించ‌ని సంగ‌తిని ఆమె గుర్తించ‌లేదు కూడా.

దీంతో, ధ‌న్షిక త‌న‌ను అవ‌మానించిన‌ట్లుగా భావించిన రాజేంద‌ర్ మీడియా ముందే ఆమెపై మండిప‌డ్డారు. సీనియ‌ర్ న‌టుడినైన తన పేరు ప్రస్తావించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. రజ‌నీకాంత్‌ తో కబాలి సినిమాలో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించ‌డం నేర్చుకోవాల‌ని ఆమెకు హితవు పలికారు. సహచర ఆర్టిస్టులు - పెద్ద ఆర్టిస్టులను గౌరవించక‌పోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు. స్టేజ్ పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని, పొరపాటు జరిగింద‌ని ధ‌న్షిక వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తాను కావాల‌ని అలా చేయ‌లేద‌ని - పొర‌పాటున మ‌ర‌చిపోయాన‌ని చెప్పినా రాజేంద‌ర్ విన‌లేదు. సారీ చెప్పినా ఆ విష‌యాన్ని వ‌దిలేయ‌కుండా ధ‌న్షిక‌ను నానా మాట‌లు అన్నారు.  చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావా?  నువ్విచ్చే గౌరవాన్ని నేను ఏ మార్కెట్లో అమ్ముకుంటానని రాజేంద‌ర్ మండిప‌డ్డారు. దీంతో ధన్షిక వేదికపైనే కన్నీటి పర్యంతమయింది. ధన్షిక పొర‌పాటు చేశాన‌ని సారీ చెప్పిన త‌ర్వాత కూడా రాజేంద‌ర్ ఆమెను దుర్భాష‌లాడినంత ప‌నిచేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియ‌ర్ న‌టుడు రాజేంద‌ర్ సంయ‌మ‌నం పాటించి ఉండాల్సింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News