'బబ్లీ బౌన్సర్' అప్ డేట్ ఇచ్చిన అందాల తమన్నా!

Update: 2022-05-04 00:30 GMT
తమన్నా గ్లామర్ తగ్గలేదు .. ఆమె పారితోషికమూ తగ్గలేదు.  పెరిగిందల్లా కొత్త హీరోయిన్ల నుంచి గట్టిపోటీనే. తమన్నా తన కెరియర్ ను మొదలెట్టేసి  చాలా కాలమే అయింది. తెలుగు .. తమిళ భాషల్లో చాలామంది స్టార్ హీరోలను చుట్టబెట్టేసింది. ఈ మధ్య కాలంలో గ్యాప్ లేకుండా వరుస అవకాశాలనైతే అందుకుంటూ వస్తోందిగానీ, వాటిలో పెద్దగా విషయం ఉండటం లేదు. సరైన అవకాశాలు లేని కారణంగానే ఆమె 'సరిలేరు నీకెవ్వరు' .. 'గని' సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో 'ఎఫ్ 3' సినిమా ఉంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇక తమన్నా వరుసగా హిందీ సినిమాలను కూడా లైన్లో పెట్టేస్తోంది. ఆల్రెడీ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతూ ఉండగా, 'బబ్లీ బౌన్సర్' షూటింగు ముగింపు దశకి చేరుకుంది. ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీగా ప్రసిద్ధి చెందిన అసోలా ఫతేపూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళా బౌన్సర్ కథ ఇది.

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మొదలైన షూటింగు చకచకా జరుగుతూ వచ్చిందనీ, మరో 5 రోజుల్లో షూటింగు పార్టు పూర్తవుతుందని ఇన్ స్టా ద్వారా తమన్నా తెలియజేసింది.

తమన్నా ఇంతవరకూ చేస్తూ వచ్చిన పాత్రలకి ఇది పూర్తి భిన్నమైనది. ఈ సినిమా బౌన్సర్ల  జీవితాలకు అద్దం పడుతుందనీ, వాళ్లకి సంబంధించిన కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని తమన్నా అంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో సౌరభ్ శుక్లా .. అభిషేక్ బజాజ్ .. సాహిల్ కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక తెలుగులో తమన్నా 'భోళా శంకర్' సినిమా చేస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి సరసన నాయికగా ఆమె నటిస్తోంది. 'సైరా' తరువాత ఆమె చిరంజీవి సరసన చేస్తున్న సినిమా ఇది. 'సైరా' చారిత్రక చిత్రం కావడం వలన, ఆమె చిరంజీవితో కలిసి ఆడిపాడే అవకాశం లేకుండా పోయింది.

కానీ 'భోళా శంకర్' మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం వలన, చిరంజీవితో సమానమైన డాన్సులతో ఈ సినిమాతో ఆమె అలరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ లో మిగతా హీరోయిన్స్ స్లో అయినప్పటికీ, తమన్నా తన దూకుడు కొనసాగిస్తుండటం విశేషమే.
Tags:    

Similar News