'జాతిర‌త్నాలు' డైరెక్ట‌ర్ తో త‌మిళ హీరో మూవీ షురూ

Update: 2022-02-10 07:41 GMT
టాలీవుడ్ స్టార్ లు పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌కు సై అంటుంటే కోలీవుడ్ హీరోలు మాత్రం వ‌రుస‌గా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇంత కాలం డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించిన త‌మిళ హీరోలు ఈ సారి ఏకంగా తెలుగులో సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టారు.

ద్వి భాషా చిత్రాల‌ని చేస్తూ తెలుగుతో పాటు ఒకే సారి త‌మిళ ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ధ‌నుష్ `సార్` పేరుతో ద్విభాషా చిత్రాన్ని మొద‌లుపెడితే తాజాగా మ‌రో త‌మిళ హీరో కూడా ద్విభాషా చిత్రాన్ని ప్రారంభించాడు.

త‌మిళంలో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ పేరు తెచ్చుకున్న హీరో శివ కార్తికేయ‌న్. తెలుగులోనూ మంచి మార్కెట్ ని ఏర్ప‌ర‌చుకున్న  శివ కార్తికేయ‌న్   ఈ ఏడాది ధ‌నుష్ త‌ర‌హాలోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రానికి `జాతార‌త్నాలు` ఫేమ్ అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ , శాంతి టాకీస్ బ్యాన‌ర్ ల‌పై నారాయ‌ణ్ దాస్ కె నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చెన్నైలోని కార‌కూడిలో ఈ మూవీని లాంఛ‌నంగా పూజా కార్యక్ర‌మాల‌తో గురువారం ఉద‌యం ప్రారంభించారు. పూజా కార్య‌క్ర‌మాల్లో నిర్మాత‌లైన డి. సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, డైరెక్ట‌ర్ అనుదీప్ కె.వి, హీరో  శివ కార్తికేయ‌న్, స‌త్య‌రాజ్‌ అండ్ చిత్ర బృందం త‌దిత‌రులు పాల్గొన్నారు. ఎంట‌ర్ టైమ్ మెంట్ జ‌ర్నీ మొద‌లైంది. తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రం కారైకుడిలో లఅధికారిక పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌బ‌డింది. నేటి నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది` అంటూ మేక‌ర్స్ ఈ మూవీ లాంఛింగ్ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇక్క‌డో విశేషం ఏంటంటే ధ‌నుష్ న‌టిస్తున్న `సార్` మూవీ తెలుగు ప‌ద్ద‌తుల ప్ర‌కారం హైద‌రాబాద్ లో లాంఛనంగా మొద‌లైతే శివ కార్తీకేయ‌న్‌, అనుదీప్ కె.వి ల సినిమా మాత్రం త‌మిళ సంప్ర‌దాయం ప్ర‌కారం చెన్నైలోని కారైకుడిలో ప్రారంభం కావ‌డం. అంతే కాకుండా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డి. సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు, ద‌ర్శ‌కుడు అనుదీప్ కె.వి శాలువా, పూల‌మాల‌లు ధ‌రించి క‌నిపించ‌డం విశేషం.
Tags:    

Similar News