ఈ దీపావళి సీజన్ తమిళ డబ్బింగ్ చిత్రాలకే బాగుందని చెప్పాలి! తెలుగులో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ఈ పండుగను హీరో కార్తీ - ధనుష్ లు షేర్ చేసుకున్నారు. గతవారం విడుదలైన కాష్మోరా - ధర్మ యోగి చిత్రాలు కలెక్షన్లపరంగా ఫర్వాలేదు అనిపించుకున్నాయి. అయితే, ఇదే నెలలో మరో రెండు డబ్బింగ్ చిత్రాలు పోటాపోటీగా టాలీవుడ్ బాక్సాఫీస్ మీద కన్నేశాయి. ఈసారి విశాల్ - విజయ్ ఆంటోనీల చిత్రాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి.
విశాల్ నటించిన అన్ని తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే, ఇంతవరకూ సూపర్ హిట్ అని చెప్పుకునే సక్సెస్ ను టాలీవుడ్ లో నమోదు చేసుకోలేకపోయాడు విశాల్. ఎప్పుడో ‘పందెం కోడి’ అనే చిత్రం మాత్రమే తెలుగునాట హిట్ అయింది. అయితే, ఈ నెల 18న వస్తున్న ‘ఒక్కడొచ్చాడు’ సినిమాతో టాలీవుడ్ లో మరో హిట్ కొడతా అని ధీమాగా ఉన్నాడు విశాల్. సాంకేతికంగా మాంచి యాక్షన్ సీక్వెన్సులు - తమన్నా అందాలు విశాల్ చిత్రానికి ప్లస్ కాబోతున్నట్టు చెప్పుకోవాలి.
ఇక, విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరో స్థాయి కలెక్షన్లు రాబట్టుకున్నాడు. ‘బిచ్చగాడు’ హిట్ తరువాత తెలుగులో తనకంటూ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఇప్పుడు ‘బేతాళుడు’గా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ పై కన్నేశాడు. బిచ్చగాడు హిట్ ట్రాక్ ను ఈ చిత్రం కొనసాగిస్తుందని విజయ్ కూడా ధీమాగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా ఈనెల 18నే విడుదల కాబోతోంది. నిజానికి, ఈ రెండు సినిమాలూ దీపావళి బరిలోనే నిలుస్తాయి అనుకున్నారు. అయితే, అప్పటికే కార్తీ - ధనుష్ చిత్రాలు లైన్లో ఉండటంతో విడుదల తేదీలను మార్చుకున్నారు. మరి, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ తమిళ హీరోల క్లాష్... ఎలా ఉండబోతోందో తేలాలంటే ఈనెల 18 వరకూ ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/