2019 బిగ్ షాక్‌: టాలీవుడ్ నిర్మాత‌ల‌కు బ్యాండ్ బాజా

Update: 2019-12-26 01:48 GMT
థియేట‌ర్ లో సినిమా 100 రోజులు..50 రోజులు ఆడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడున్న డిజిట‌ల్ యుగంలో థియేట‌ర్ 10 రోజులు ఆడినా వంద రోజుల‌తో స‌మానం. అమెజాన్-నెట్ ప్లిక్స్ లాంటి డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌లు అందుబాటులోకి రావ‌డంతో నెల రోజుల్లోనే సినిమా స్మార్ట్ ఫోన్- ఓటీటీల్లో వ‌చ్చేస్తోంది. దీనిపై దిల్ రాజు- సురేష్ బాబు- అల్లు అర‌వింద్ లాంటి దిగ్గజ నిర్మాత‌లు ఇప్ప‌టికే త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. డిజ‌ట‌ల్ తో థియేట‌ర్ యాజ‌మాన్యాలకు పెద్ద‌గా నష్టం ఉండ‌ద‌ని...సినిమా కిక్కు దొర‌కాలంటే ప్రేక్ష‌కుడు థియేట‌ర్ నే ఎంపిక చేసుకుంటాడని న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఈ విధానం వ‌ల్ల నిర్మాత లాభ‌ప‌డుతాడు కానీ.. పంపిణీ దారుడు న‌ష్ట‌పోతాడు అన్న సంగ‌తి ఇప్ప‌టికే ప్రూవైంది. సినిమా థియేట‌ర్ల‌ లో ఆడుతుండ‌గానే డిజిట‌ల్ స్ట్రీమింగు కి రావ‌డం క‌లెక్ష‌న్ల‌ను దెబ్బ కొడుతోంది. దేశ వ్యాప్తంగా సినిమాల‌న్నీ ఈ క్ర‌మంలోనే రిలీజ్ అవుతున్నా.. డిజిట‌ల్ బెంగ పంపిణీదారుడిని నిల‌వ‌నీయ‌డం లేదు. అయితే తాజాగా కోలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్లు ఈ విధానానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం లో భాగంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. థియేట‌ర్లో విడుద‌లైన సినిమా వంద రోజుల త‌ర్వాత డిజిట‌ల్ - ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేసారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం 8 శాతం వినోద ప‌న్ను ను ర‌ద్దు చేయాల‌ని.. పెద్ద చిత్రాల ద్వారా న‌ష్ట‌పోతే ఆ న‌ష్టాన్ని ఆ చిత్ర న‌టీన‌టులే భ‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే మార్చి 1 నుంచి రాష్ట్ర‌ వ్యాప్తంగా థియేట‌ర్లు మూసివేస్తామ‌ని పంపిణీదారుల‌ సంఘం హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క‌ట‌న కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ వాడి వేడిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చిన పాల‌సీల‌న్ని డిస్ట్రిబ్యూట‌ర్ల‌ ను కుదిపేసేవేన‌ని.. ప్ర‌స్తుతం టెక్నాల‌జీని అడ్డు పెట్టుకుని నిర్మాత‌లు- ద‌ర్శ‌కులు- హీరోలు కోటీ శ్వ‌రులు అవుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. కానీ సినిమాని మాత్ర‌మే న‌మ్మి కోట్లాది రూపాయ‌లు పెట్టి రైట్స్ ద‌క్కించుకుని రిలీజ్ చేస్తే పంపిణీ వ‌ర్గాల‌ న‌ష్టాల్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. కొంత మంది అగ్ర హీరోలు మాత్ర‌మే న‌ష్టాల‌ను భ‌రించే బాధ్య‌త‌ల్ని తీసుకుంటున్నారు. అది కూడా పాక్షికంగానే జ‌రుగుతోంది. మ‌రి ఈ డిమాండ్ల పై కోలీవుడ్ స‌హా టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల్లోనూ చ‌ర్చ‌కొచ్చింది. మునుముందు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ డిస్ట్రిబ్యూట‌ర్ల‌ లో మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై చ‌ర్చించే దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌పై డిజిట‌ల్ పై తీవ్ర ఆంక్ష‌ల్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ తెలుగు సినిమా పంపిణీదారులంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఇటు నైజాం పంపిణీదారులు.. అటు ఆంధ్రా సీడెడ్ పంపిణీదారులు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రానున్నార‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News