తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ యువహీరో

Update: 2019-12-31 06:36 GMT
తెలుగు హీరోలు తమిళ మార్కెట్ పై దృష్టి సారించడం అనే కాన్సెప్ట్ ఈమధ్య చూస్తున్నాం కానీ తమిళ హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేయడం అనేది కన్నాంబ కాలం నుంచి ఉన్నదే. అప్పుడెప్పుడో రజనీకాంత్.. కమల్ హాసన్ లాంటి వారు విజయవంతంగా ఈ పని చేశారు. ఇప్పటికీ రజనీకి తెలుగులో మార్కెట్ ఉంది. ఇక ఎంతో మంది ఇతర తమిళ హీరోలు కూడా అదే బాటలో తమకంటూ మార్కెట్ ఏర్పరచుకున్నారు. విక్రమ్.. సూర్య.. కార్తి.. విజయ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. ఒక్కో సమయం లో ఒక్కొకరి హవా ఉంటుంది. ఇక ఈ బాటలో మరో తమిళ యువ హీరో కూడా పయనించాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఆ హీరో ఎవరో కాదు.. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కరుణానిధి మనవడు.. ప్రస్తుతం డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. ఈ ఉదయనిధి ఇప్పటి వరకూ దాదాపు డజను తమిళ సినిమాల్లో నటించాడు. ఇతను నటించిన 'ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమా తెలుగులో 'OK OK' అనే టైటిల్ తో చాలా ఏళ్ల క్రితం విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇలాంటి ప్రయత్నాలు పక్కన పెడితే ఉదయనిధి ప్రస్తుతం తన కొత్త సినిమా 'సైకో' ను తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావ్ హైదరీ.. నిత్యా మేనన్ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ అని.. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే అవకాశం ఉందని 'సైకో' టీమ్ భావిస్తున్నారట. దానికి తోడు హీరోయిన్లు కూడా తెలుగు లో పాపులర్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట.

ఈ సినిమా తమిళంలో జనవరి 24 న రిలీజ్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ కూడా ఖరారు చేస్తారని సమాచారం. ఈ సినిమానే కాదు భవిష్యత్తు లో కూడా ఉదయనిధి తన సినిమాలను తెలుగు లో తప్పని సరిగా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ కరుణానిధి మనవడు తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తాడో వేచి చూడాలి.


Tags:    

Similar News