టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న నంది వివాదం సద్దుమణుగుతోందని భావిస్తున్న తరుణంలో ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యాలు పెను దుమారాన్ని రేపాయి. లోకేష్ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. లోకేష్ పై టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పోసాని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, లోకేష్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత - దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నంది వివాదంపై హుందాగా స్పందించారని, ఆ అవార్డులకు ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చెప్పారని తమ్మారెడ్డి అన్నారు. అవార్డుల విషయంలో కుల, మతాల ప్రస్తావన ఉండదని, దానిని ప్రభుత్వానికి ఆపాదించవద్దని తాను రెండు రోజుల క్రితమే చెప్పానని తమ్మారెడ్డి తెలిపారు. అంతవరకు బాగానే ఉందని, అయితే, ఈ అవార్డుల వివాదంపై మంత్రి లోకేష్ బాబు చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని అన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డులు లేనివారు ఈ వివాదంపై స్పందిస్తున్నారని బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారు వ్యాఖ్యానించడం బాధాకరమైన విషయమన్నారు. సాక్ష్యాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయి ఉండి, బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇంత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు.
దయచేసి లోకేష్ గారు తెలుసుకొని మాట్లాడాలని, ఎప్పుడైనా సరే మాట్లాడే ముందు ఆయన పరువు కంటే ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారి పరువు గురించి ఆలోచించాలని అన్నారు. ఆధార్ కార్డుల విషయానికొస్తే, నిన్న మొన్నటి వరకు లోకేష్ గారి ఆధార్ కార్డు ఎక్కడుందని? ఆయన తండ్రి చంద్రబాబుగారి ఆధార్ కార్డు ఎక్కడుందని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికీ వారు హైదరాబాద్ లోనే ఉంటున్నారని, అటువంటిది వారికి ఆధార్ ల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడగడం బాగుండదని, అసహ్యంగా ఉంటుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని, లోకేష్ ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని, ఆ రాష్ట్రాన్ని వారు ఏలుతున్నారని, అయితే, వారు అంతే హుందాగా గౌరవంగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పారు.
అయితే, ఇవి ఆధార్ కార్డుల అవార్డులు కావని, తెలుగు సినిమాలకు ఇచ్చే నంది అవార్డులని లోకేష్ ను ఉద్దేశించి తమ్మారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ లోకేష్ గారికి ఇష్టమైతే ఆధార్ కార్డులకు సంబంధించి అవార్డులను ప్రకటించాలని, అపుడు ఎవరూ ఏమీ మాట్లాడరని చురకలంటించారు. కావాలంటే ఆధార్ కార్డులున్న వారి నుంచే రాబోయే నంది అవార్డుల ఎంట్రీలను తీసుకోవాలని అన్నారు. అవగాహన లేమితో, తెలియకుండా మాట్లాడి తన పరువును, రాష్ట్రం పరువును తీయొద్దని తమ్మారెడ్డి అన్నారు. ఇది కేవలం తన ఆలోచన మాత్రమే అని, సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదని, తనకు అనిపించింది చెప్పానని అన్నారు. చంద్రబాబుగారంటే తనకు గౌరవమని, ఆయనతో కలిసి పనిచేశానని, లోకేష్ ను చిన్నతనం నుంచి చూసిన వాడిని కాబట్టే తన ఆలోచనలను వ్యక్తపరిచానని తమ్మారెడ్డి అన్నారు. తాను చెప్పింది తప్పైతే క్షమించాలని, ఒప్పైతే స్వీకరించాలని కోరారు.