నిఖిల్ తో పెళ్లి చూపులు దర్శకుడు

Update: 2018-02-14 05:55 GMT
తన మొదటి సినిమా పెళ్లి చూపులుతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తర్వాత మాత్రం బాగా స్లో అయిపోయాడు. ద్వితీయ విఘ్నానికి భయపడ్డాడో లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కాని పెళ్లి చూపులు వచ్చి ఏడాదిన్నర అవుతున్నా తరుణ్ భాస్కర్ రెండో సినిమా ఇప్పటి దాకా విడుదల కాలేదు. ఐదారు నెలల క్రితం సెట్స్ పైకి వెళ్ళిన అతని సెకండ్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పెళ్లి చూపులు తరహాలోనే ఇది కూడా కొత్త నటీనటులతో లిమిటెడ్ బడ్జెట్ లోనే తీస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ కూడా దీనికి పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇది అయ్యాక తరుణ్ నిఖిల్ తో చేయబోయే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే నిఖిల్ ను కలిసిన తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ ఇద్దరికీ ఓకే కావడంతో ఇప్పుడున్న కమిట్మెంట్స్ పూర్తి చేసాక సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

నిఖిల్ కూడా కొత్త తరం దర్శకులతో పని చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. తన కెరీర్లో పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాలన్నీ సీనియర్లు చేసినవి కాకపోవడం అతని నమ్మకాన్ని బలపరుస్తోంది. ప్రస్తుతం కన్నడ బ్లాక్ బస్టర్ రీమేక్ కిరాక్ పార్టీ ఫినిషింగ్ లో బిజీ గా ఉన్న నిఖిల్ ఆ తర్వాత కూడా మరో తమిళ్ రీమేక్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. కనితన్ పేరుతో రెండేళ్ళ క్రితం వచ్చిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీపై నిఖిల్ మనసు పారేసుకున్నాడు. ఇది పూర్తయ్యాక తరుణ్ భాస్కర్ తో జత కట్టనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి స్టొరీ డిస్కషన్ స్టేజిలోనే ఉన్న ఈ మూవీకి ఇంకా టైం పట్టేలా ఉంది.

కేశవ తర్వాత కొద్దిగా స్లో అయిన నిఖిల్ ఇక నుంచి స్పీడ్ పెంచేలా ఉన్నాడు. నిజానికి కిరాక్ పార్టీ ఫిబ్రవరి 9నే విడుదల చేసేలా ఇంతకు ముందు నిర్ణయించుకున్నారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ చాలా పెండింగ్ లో ఉండిపోవడంతో పాటు ప్రమోషన్ కు టైం పూర్తిగా కేటాయించలేమేమో అన్న మీమాంసలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అదే ప్లస్ గా మారనుంది. మరో కొద్ది రోజుల్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెబుతున్నాడు నిఖిల్.
Tags:    

Similar News