న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఆక‌స్మిక మృతి

Update: 2020-09-08 03:30 GMT
ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఆయ‌న నివాసంలో ఆక‌స్మికంగా గుండెపోటు రావ‌డంతో కుప్ప‌కూలార‌ని తెలుస్తోంది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింది. ఇక జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి కొంత‌కాలంగా షూటింగులు లేక గుంటూరులోని స్వ‌గృహంలోనే ఉంటున్నారు. ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణానికి ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తోంది.

జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ప్ర‌తిభ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎం.ఎస్.నారాయ‌ణ‌.. ఏ.వియ‌స్ .. కోట శ్రీ‌నివాస‌రావు వంటి ప్ర‌ముఖ న‌టుల‌కు ధీటుగా ఆయ‌న టాలీవుడ్ లో రాణించారు. క‌మెడియ‌న్ గా.. విల‌న్ గా త‌న‌దైన శైలి న‌ట‌న‌తో తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచారు. రాయలసీమ మాండలికాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడిగా ఆయనకంటూ ఓ శైలి ఉంది. ఫ్యాక్షన్ సినిమాల్లో సీమ మాండ‌లీకం తో విల‌న్ గా మెప్పించిన జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి చాలా సినిమాల్లో కామెడీ పాత్ర‌ల‌తోనూ మెప్పించారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల. సినీరంగ‌ప్ర‌వేశానికి ముందు పోలీస్ అధికారిగా పనిచేశారు.

వెంక‌టేష్ బ్ర‌హ్మ‌పుత్రుడు సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగు పెట్టిన ఆయ‌న‌కు దాస‌రి గురువు. టాలీవుడ్ కి పరిచయం చేసింది ద‌ర్శ‌క‌ర‌త్న‌నే. ప్రేమించుకుందాం రా- సమరసింహారెడ్డి- జయం మనదేరా- నరసింహనాయుడు- చెన్నకేశవరెడ్డి- ఎవడిగోల వాడిది- సీమ టపాకాయ్- నమో వెంకటేశ‌‌- రెడీ  వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. ఇటీవ‌ల మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో క‌నిపించారు. విల‌నిజాన్ని .. కామెడీ విల‌నిజాన్ని ఆవిష్క‌రించిన గొప్ప న‌టుడిగా జ‌య‌ప్ర‌కాష్ రెడ్డిని తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేరు.
Tags:    

Similar News