ఈ వారం విజేత ఎవరు?

Update: 2018-03-23 05:10 GMT
కొన్ని వారాల పాటు స్తబ్దుగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ లో గత వారం నుంచి కొంచెం కదలిక వచ్చింది. ‘కిరాక్ పార్టీ’ లాంటి యూత్ ఫుల్ మూవీ రాకతో మళ్లీ థియేటర్లు కొద్దిగా కళకళలాడాయి. వచ్చే వారం ‘రంగస్థలం’ వేడి పుట్టించడానికంటే ముందు ఈ వారం ఇంకొంచెం ఊపు రాబోతోంది. ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ రేసులోకి దిగుతున్నాయి. ఇందులో ప్రధాన పోటీ రెండు సినిమాల మధ్యే. అవే.. ఎమ్మెల్యే.. నీది నాది ఒకే కథ.

సమ్మర్ సీజన్లో రాబోయే తొలి కమర్షియల్ హంగులున్న సినిమా ‘ఎమ్మెల్యే’. ‘పటాస్’తో మాంచి విజయాన్నందుకుని.. ఆ తర్వాత ‘షేర్’.. ‘ఇజం’ సినిమాలతో బోల్తా కొట్టిన కళ్యాణ్ రామ్.. ఈ చిత్రంపై చాలా ఆశలతో ఉన్నాడు. ‘పటాస్’ తరహాలోనే ఇది కూడా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. ఒక్కక్షణం కూడా బోర్ కొట్టించకుండా సాగే సినిమా ఇదని నందమూరి హీరో అంటున్నాడు. దీని ట్రైలర్ చూసినా ఇందులో కమర్షియల్ హంగులకు ఢోకా ఏమీ ఉండదనిపిస్తోంది. కాజల్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఉపేంద్రమాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు.

ఇక ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న రెండో సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’. వైవిధ్యమైన సినిమాలతో సాగుతున్న శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రమిది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్చేశారు. నారా రోహిత్ ఈ చిత్ర సమర్పకుడు కావడం విశేషం. వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. చదువు సరిగా రాని.. జీవితంలో సెటిల్ కాని వాళ్లందరినీ అప్రయోజకులుగా చూసే సమాజం మీద వదిలిన అస్త్రంలా కనిపిస్తోందీ సినిమా. దీంతో పాటుగా డబ్బింగ్ సినిమాలు ‘రాజరథం’.. ‘ఆనందం’ కూడా ఈ శుక్రవారమే విడుదలవుతున్నాయి. ఇవి కొంతవరకు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘అనగనగా ఒక ఊళ్లో’.. ‘మర్లపులి’ అనే సినిమాలు కూడా వస్తున్నాయి కానీ.. వాటిని జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు.
Tags:    

Similar News