వెరీ ల‌క్కీ ప‌ర్స‌న్ ఉద‌య్ కిర‌ణ్‌.. హీరో ఛాన్స్ ఎలా వ‌చ్చిందో తెలుసా?

Update: 2021-06-26 08:30 GMT
సినిమా ఇండ‌స్ట్రీలో టాలెంట్ కన్నా.. అదృష్టం పాళ్లే ఎక్కువ‌గా ఉండాల‌ని అంటుంటారు. ఎందుకంటే.. ఎంత టాలెంట్ ఉన్నా.. దాన్ని నిరూపించుకోవ‌డానికి అవ‌కాశం అనేది రావాలి క‌దా! అందుకే.. ఇక్క‌డ అదృష్టాన్నే ఎక్కువ‌గా న‌మ్ముతుంటారు. అలా చూసుకున్న‌ప్పుడు.. టాలీవుడ్ లో ఎవ‌ర్ గ్రీన్ ల‌వ‌ర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ కూడా ల‌క్కీయెస్ట్ ప‌ర్స‌న్ అని చెప్పొచ్చు.

ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కించిన 'చిత్రం' సినిమాతో ఉద‌య్ హీరోగా పరిచయం అయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆయ‌న‌కు ఆ ఛాన్స్ ఎలా వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య పోతారు. ఈ సినిమాకు అంతా కొత్త‌వాళ్ల‌ను ఆడిష‌న్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో.. ఓ హిందీ యాక్ట‌ర్ ను హీరోగా ఫైన‌ల్ చేశారు. హీరో ఫ్రెండ్స్ పాత్ర కోసం ఉద‌య్ కిర‌ణ్ ను తీసుకున్నారు. అయితే.. ఉన్న‌ట్టుండి ఆ హిందీ న‌టుడు తాను ఈ సినిమా చేయ‌లేన‌ని చెప్పాడు. దీంతో.. జాక్ పాట్ కొట్టేశాడు ఉద‌య్‌. ఇత‌న్నే హీరోగా పెడ‌దామ‌ని చెప్పాడ‌ట తేజ‌. అలా.. తొలి చిత్రంతోనే హీరోగా తెరంగేట్రం చేశాడు ఉద‌య్ కిర‌ణ్‌.

సీన్ క‌ట్ చేస్తే.. ఆ సినిమా ఘ‌న‌ విజ‌యం సాధించింది. కేవ‌లం 42 ల‌క్ష‌ల‌తో పూర్త‌యిన ఈ సినిమా.. దాదాపు 8 కోట్లు క‌లెక్ట్ చేసింది. హైద‌రాబాద్ క్రాస్ రోడ్స్ లోని ఒకే ఒక థియేట‌ర్లో (మినీ ఓడియ‌న్) విడుద‌లైన ఈ సినిమా.. ఆ త‌ర్వాత ప్రింట్లు పెంచుకుంటూ.. థియేట‌ర్ల‌ను క‌బ్జా చేస్తూ వెళ్లింది. అయితే. ఈ సినిమా త‌ర్వాత కూడా హీరోకు ఛాన్సులు రాలేదు. దీంతో.. తేజతోనే తిరిగేవాడు.

అలాంటి ప‌రిస్థితుల్లో.. తేజ 'నువ్వు నేను' చిత్రానికి ప్లాన్ చేశాడు. హీరో ఎవరో తెలుసా? అప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న మాధవన్. కానీ.. ఆయ‌న కూడా సినిమా చేయ‌లేన‌ని చెప్పాడు. దీంతో.. ఉద‌య్ ను మ‌రోసారి అదృష్టం వ‌రించింది. ఈ సారి కొట్టిన హిట్టు అలాంటిలాంటిది కాదు. ఇండ‌స్ట్రీనే షేక్ చేసిన ల‌వ్ స్టోరీ అది. ఆ విధంగా.. ఊహించ‌ని రీతిలో రెండు సినిమాల్లో ఛాన్సులు కొట్టేయ‌డం.. అవి సూప‌ర్ హిట్లు కావ‌డం.. ఆ స‌మ‌యంలోనే వచ్చిన 'మ‌న‌సంతా నువ్వే' కూడా మంచి హిట్ గా నిలవడంతో.. ఉద‌య్ కిర‌ణ్ పేరు మార్మోగింది.

కానీ.. అత‌ని ఆనందం మూణ్నాల్ల ముచ్చ‌టే అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత చేసిన సినిమాల్లో ఒక్క‌టి కూడా హిట్ కాలేదు. ఆ త‌ర్వాత క్ర‌మంగా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఈ వాస్త‌వాన్ని ఉద‌య్ జీర్ణించుకోలేక మాన‌సికంగా కుంగిపోయాడు. 2014లో అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇవాళ ఉద‌య జ‌యంతి. అత‌ను ఈ లోకం నుంచి దూర‌మైనా.. ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో మాత్రం చిర‌స్థాయిగా నిలిచిపోయాడు.
Tags:    

Similar News