ఫిబ్రవరి వినోదాల విందు.. బాక్సాఫీస్ బరిలో క్రేజీ చిత్రాలు..!
అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం పలు క్రేజీ చిత్రాలు ధియేటర్లలోకి రాబోతున్నాయి.
టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాలు కొత్త ఏడాదికి మంచి ఆరంభాన్ని అందించాయి. ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి మూడు చిత్రాలు రిలీజైతే, వాటిల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి..’ మూవీ పొంగల్ విన్నర్ గా నిలిచింది. రాబోయే రెండు వారాల వరకూ తెలుగులో పెద్ద రిలీజులేవీ లేవు కాబట్టి, అప్పటి వరకూ సంక్రాంతి చిత్రాల సందడే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం పలు క్రేజీ చిత్రాలు ధియేటర్లలోకి రాబోతున్నాయి.
‘తండేల్’ సినిమాతో అక్కినేని నాగచైతన్య ఫిబ్రవరికి స్వాగతం పలకనున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే నెల 7వ తేదీన విడుదల కానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఆల్రెడీ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. 'లవ్ స్టోరీ' తర్వాత చైతూ - సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
వాస్తవ సంఘటనల ఆధారంగా, అందమైన ప్రేమకథతో ‘తండేల్’ సినిమా రూపొందింది. చైతన్య తన కెరీర్ లోనే తొలిసారిగా డీగ్లామర్ క్యారక్టర్ లో, ఒక మత్స్యకారుడిగా కనిపించనున్నారు. 'బుజ్జి తల్లి' పాట చూస్తుంటే సాయి పల్లవితో చైతూ కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు అర్థమవుతుంది. రాజు, బుజ్జి తల్లి పాత్రల్లో ఇద్దరూ అధ్బుతమైన నటన కనబరిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం.. వాలెంటైన్స్ వీక్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
‘తండేల్’ కంటే ఒక్కరోజు ముందుగా అజిత్ కుమార్ నటించిన ‘పట్టుదల’ అనే డబ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా పొంగల్ కు రిలీజ్ చెయ్యాలకున్న ఈ చిత్రాన్ని చివరకు ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నారు. మగిళ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ‘లైలా’, ‘దిల్ రూబా’, ‘బ్రహ్మా ఆనందం’ వంటి ముచ్చటగా మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఇందులో విశ్వక్ ఒక అమ్మాయి పాత్రలో కనిపించడం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ‘క’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘దిల్ రూబా’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రియల్ లైఫ్ లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం - రాజా గౌతమ్.. ‘బ్రహ్మా ఆనందం’ సినిమాలో తాత-మనవడిగా నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికైతే ఈ మూడు సినిమాల టీజర్లు ఆకట్టుకున్నాయి.
లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి ‘ఊరు పేరు భైరవకోన’తో హిట్టు కొట్టిన సందీప్ కిషన్.. ఈసారి ఫిబ్రవరి 21న ‘మజాకా’ మూవీతో అలరించడానికి వస్తున్నాడు. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాని కూడా ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్లలోకి తీసుకురానున్నారు. హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే తమిళ డబ్బింగ్ చిత్రాన్ని కూడా అదే రోజున రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక మహా శివరాత్రి స్పెషల్ గా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు' చిత్రాన్ని 2025 శివరాత్రికి రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు గతంలో ప్రకటించారు. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ‘భైరవం’ సినిమాని కూడా అదే సీజన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆది పినిశెట్టి నటిస్తున్న ‘శబ్దం’ సినిమాని ఫిబ్రవరి ఆఖరి వారంలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.