మూవీ రివ్యూ : 'థ్యాంక్ యు బ్రదర్'

Update: 2021-05-07 07:35 GMT
చిత్రం : ‘థ్యాంక్ యు బ్రదర్’

నటీనటులు: అనసూయ భరద్వాజ్-విరాజ్ అశ్విన్-అర్చన అనంత్-అనీష్ కురువిల్లా-వైవా హర్ష-సమీర్-కాదంబరి కిరణ్-అన్నపూర్ణమ్మ-ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సంగీతం: గుణ సుబ్రహ్మణ్యన్
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
కథ: రమేష్ రాపర్తి-నియి అకిన్మోలయన్-మోరిస్.కె.సేసే
మాటలు: రమేష్ రాపర్తి-మావిటి సాయి సురేంద్ర బాబు
నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి-తారకనాథ్ బొమ్మిరెడ్డి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ రాపర్తి

కరోనా ధాటికి మరోసారి థియేటర్లు మూత పడ్డ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో విడుదలైన కొత్త సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్’. అనసూయ-విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

 ప్రసవానికి సిద్ధమవుతున్న దశలో భర్తను కోల్పోయి ఆర్థికంగా.. మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రియ (అనసూయ) తనకు అందాల్సిన ఒక చెక్కు కోసమని ఓ అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. అదే అపార్ట్‌మెంట్‌కు అభి (విరాట్ అశ్విన్) కూడా వస్తాడు. అతను డబ్బుందన్న పొగరుతో విచ్చలవిడిగా ప్రవర్తించి చివరికి తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో ఉద్యోగ వేటలో ఉంటాడు. వీళ్లిద్దరూ ఆ అపార్ట్‌మెంట్‌ కు వచ్చిన పని జరగకపోవడంతో నిరాశగా లిఫ్టులోకి ఎక్కుతారు. అప్పుడే ఆ లిఫ్ట్ దెబ్బ తిని బేస్మెంట్ కిందికి వెళ్లి ఇరుక్కుపోతుంది. ఇంతలో ప్రియకు నొప్పులు మొదలవుతాయి. ఈ స్థితిలో ఆమెను కాపాడ్డానికి అభి ఏం చేశాడు.. వీళ్లిద్దరూ క్షేమంగా అక్కడి నుంచి బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కాన్సెప్ట్ విపులంగా అర్థమైపోయింది. బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు.. ఒక నిండు గర్భిణి ఒక లిఫ్టులో ఇరుక్కుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడేలోపు ఆ కుర్రాడిలో పరివర్తన రావడం. ఇలా మానవ సంబంధాల విలువ తెలియని వ్యక్తులు ఒక పెద్ద ఉపద్రవంలో చిక్కుకుని దాన్నుంచి బయటపడే క్రమంలో పరివర్తన చెందే కాన్సెప్ట్ తో ‘వేదం’ లాంటి కొన్ని సినిమాలు తెలుగులో ఇంతకుముందే చూశాం. ఇలాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులు ఏమేర కనెక్ట్ అవుతారు.. భావోద్వేగాలు ఎంత వరకు పండుతాయి అన్నది కీలకం. పాత్రల తాలూకు బ్యాక్ స్టోరీలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయన్నదీ ముఖ్యమే. ఐతే ‘థ్యాంక్ యు బ్రదర్’లో లిఫ్టులో సాగే కథ కొంత ఉత్కంఠ రేపినా.. చివర్లో కొంత వరకు భావోద్వేగాలు పండినా.. అంతకుముందు చూపించిన వ్యవహారంతోనే సమస్య అంతా. లిఫ్ట్ తాలూకు వ్యవహారం కొత్తగా అనిపించినా.. అంతకుముందు చూపించే ప్రధాన పాత్రల బ్యాక్ స్టోరీలు ఒక టెంప్లేట్లో సాగిపోవడం.. మరీ బోర్ కొట్టించేయడంతో ముందే ‘థ్యాంక్ యు బ్రదర్’ ఇంప్రెషన్ పోగొట్టేస్తుంది. ఆఖర్లో కొంత డ్యామేజ్ కంట్రోల్ జరిగినా.. అది సినిమా మీద ఇంప్రెషన్ ను పెద్దగా మార్చదు.

కేవలం గంటన్నరకు కాస్త ఎక్కువ నిడివి ఉన్న సినిమా ‘థ్యాంక్ యు బద్రర్’. ఈ నిడివి.. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వింటే హాలీవుడ్ సినిమాలు గుర్తుకు రాక మానవు. నిజమే.. ‘థ్యాంక్ యు బద్రర్’ వెనుక ఓ అంతర్జాతీయ సినిమా స్ఫూర్తి ఉంది. ‘ఎలివేటర్ బేబీ’ అనే నైజీరియా మూవీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి. కాకపోతే సైలైంటుగా కాన్సెప్ట్ లేపేయకుండా.. కథ క్రెడిట్ కూడా ఒరిజినల్ రైటర్లకు ఇవ్వడం మంచి విషయం. కొంత నేటివిటీ.. కొత్త సన్నివేశాలు చేర్చి ఆ కథను తెలుగైజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఐతే హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం ‘థ్యాంక్ యు బ్రదర్’కు అతి పెద్ద మైనస్ అయింది. తల్లిదండ్రుల నియంత్రణ లేకుండా డబ్బు మదంతా కళ్లు నెత్తికెక్కిన కుర్రాడి పాత్రను ఏమాత్రం కొత్తగా చూపించే ప్రయత్నం జరగలేదు. ఎన్నో సినిమాల్లో చూసిన టెంప్లేట్ సీన్స్ ఇందులో కనిపిస్తాయి. ఆ పాత్ర విపరీత ప్రవర్తన మరీ చిరాకు పెట్టేస్తుంది. నిజానికి నిండు గర్భిణిగా ఉండగా భర్తను కోల్పోయిన అనసూయ పాత్ర బ్యాక్ స్టోరీతో బాగా ఎమోషన్ పండించడానికి అవకాశమున్నప్పటికీ దాన్ని పైపైన చూపించిన దర్శకుడు.. కుర్రాడి పాత్ర తాలూకు  బోరింగ్ కథ కోసం ఈ గంటన్నర సినిమాలో ఏకంగా 40 నిమిషాలు కేటాయించాడు. అక్కడే ‘థ్యాంక్ యు బ్రదర్’ దారి తప్పేసింది.

ఫ్లాష్ బ్యాక్ మొదలైన దగ్గర్నుంచి.. అదెప్పుడు ముగిసిపోయి లిఫ్ట్ స్టోరీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఐతే గంట సమయం గడిచాక కానీ అసలు ‘కథ’ మొదలు కాదు. అది మొదలైన దగ్గర్నుంచి కథనం కొంచెం ఉత్కంఠభరితంగానే నడుస్తుంది. ఎమోషన్స్ కూడా ఓకే. కానీ ఇక్కడ కథను ఎక్కువ సమయం సస్టైన్ చేయలేకపోయిన దర్శకుడు.. హడావుడిగా ముగించడానికి చూశాడు. అక్కడ పెద్దగా మలుపులు కూడా ఏమీ కనిపించవు. చకచకా కథ ముగింపు దిశగా వెళ్లిపోతుంది. పతాక సన్నివేశాలు కొంత ఎమోషనల్ గా అనిపించి మంచి అనుభూతినే ఇస్తాయి. కానీ గంటన్నర నిడివిలో చివరి పావుగంట మినహాయిస్తే ప్రేక్షకులను కదిలించే అంశాలేమీ లేకపోయాయి. అభి పాత్రలో కాస్తయినా కొత్తదనం కోసం ప్రయత్నించి ఉంటే.. అతడి బ్యాక్ స్టోరీని కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేసి ఉంటే ‘థ్యాంక్ యు బ్రదర్’ చివరి అనుభూతి వేరుగా ఉండేది. ఒక భిన్నమైన ప్రయత్నం అన్నది మినహాయిస్తే.. ఓవరాల్ గా ‘థ్యాంక్ యు బ్రదర్’ ప్రత్యేకమైన అనుభూతినేమీ కలిగించదు. ఇదంత గుర్తుంచుకోదగ్గ సినిమా ఏమీ కాదు.

నటీనటులు:

బుల్లితెరపై తనకున్న ఇమేజ్ కు భిన్నంగా సినిమాల్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో ఆశ్చర్యపోయే అనసూయ భరద్వాజ్.. మరో సాహసోపేత పాత్రతో ఆకట్టుకుంది. నిండు గర్భిణిగా ఆమె కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సహజమైన నటనతో తన పాత్ర మీద ఆపేక్ష కలిగేలా చేయగలిగింది. కానీ ఆ పాత్రను.. అనసూయ ప్రతిభను దర్శకుడే మరింత ఉపయోగించుకోవాల్సింది అనిపిస్తుంది. ఉన్నంతలో అనసూయ మంచి నటనతో ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేసింది. డబ్బు మదంతో గాడి తప్పిన కుర్రాడిగా విరాజ్ అశ్విన్ కూడా బాగానే చేశాడు. కానీ తన పాత్ర మరీ రొటీన్ గా ఉండి ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. హీరో తల్లి పాత్రలో సీరియల్ నటి అర్చన అనంత్.. స్టెప్ ఫాదర్ గా అనీష్ కురువిల్లా బాగా చేశారు. హీరో స్నేహితులుగా వైవా హర్ష.. మరో కుర్రాడు ఓకే. కాదంబరి కిరణ్.. అన్నపూర్ణమ్మ.. సమీర్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘థ్యాంక్ యు బ్రదర్’ బాగానే అనిపిస్తుంది. గుణ సుబ్రహ్మణ్యన్ నేపథ్య సంగీతం టైటిట్స్ దగ్గరే భిన్నంగా అనిపిస్తుంది. లిఫ్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచడానికి.. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు రేకెత్తించడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉపయోగపడింది. సినిమాలో ఉన్న ఒక్క పాట పర్వాలేదు. సురేష్ రగుతు ఛాయాగ్రహణం కూడా బాగానే అనిపిస్తుంది. లిఫ్ట్ నేపథ్యంంలో వచ్చే సన్నివేశాల్లో ఛాయాగ్రాహకుడి కష్టం తెలుస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి అరంగేట్రంలో ఓ భిన్నమైన కథను ఎంచుకోవడం అభినందనీయమే. కానీ రెడీమేడ్ కథను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో అతను విఫలమయ్యాడు. కేవలం కథ కొత్తగా ఉంటే సరిపోదు.. అందులో కథనం.. సన్నివేశాలు కూడా భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. చివరి అరగంట లిఫ్ట్ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ సినిమాను గట్టెక్కించేస్తుందని అనుకున్నాడో ఏమో.. మిగతా వ్యవహారాన్ని మరీ రొటీన్ సన్నివేశాలతో నింపేశాడు. ముందు తగిలిన గాయానికి తర్వాత మందు రాసే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది.

చివరగా: థ్యాంక్ యు బ్రదర్.. మిస్ ఫైర్!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News