ఆ స్టార్ డైరెక్టర్ కి అదో సెంటిమెంట్ అట!

Update: 2021-05-29 02:30 GMT
తెలుగులో తమిళ దర్శకుల ప్రభావం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అలా తమిళం నుంచి వచ్చి ఇక్కడ కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో కేఎస్ రవికుమార్ ఒకరు. తమిళంలో రజనీ .. కమల్ .. శరత్ కుమార్ .. అజిత్ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన, తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జునలతో సినిమాలు చేశారు. కమల్ కథానాయకుడిగా చేసిన 'దశావతారం' ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది.

ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే కేఎస్ రవికుమార్, తన సినిమాల్లో ఏదో ఒక చిన్నపాత్రలో ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఒక సినిమాకి నేను దర్శకత్వం వహిస్తుండగా, ఒక చిన్న రోల్ చేయవలసిన 'రాంబో రాజ్ కుమార్' రాలేదు. ఆయన కోసం ఎదురుచూసేంత సమయం లేకపోవడంతో ఆ పాత్రను నేను చేయవలసి వచ్చింది. నేను తెరపై కనిపించడం ఆడియన్స్ కి గమ్మత్తుగా అనిపించింది.

ఆ తరువాత మరో సినిమా షూటింగు జరుగుతూ ఉండగా కూడా అలాగే జరిగింది. ఒక ముఖ్యమైన పాత్రకి నిళల్ గళ్ రవిని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన ఆయన షూటింగుకు రాలేకపోయారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వేషం నేనే వేయవలసి వచ్చింది. ఆ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలు విజయాలను అందుకున్నాయి. అప్పటి నుంచి నేను చేసే ప్రతి సినిమాలో నేను కనబడటమనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. రజనీకాంత్ .. చిరంజీవిగారి లాంటివారికి కథ చెప్పడానికి వెళితే, "ముందు ఈ సినిమాలో మీరు ఏ పాత్ర చేస్తున్నారో చెప్పండి" అని అడుగుతూ ఉంటారు అని చెబుతూ నవ్వేశారు.          
Tags:    

Similar News