చిరుతపులి షాట్ ను షూట్ చేస్తున్నప్పుడు జరిగిందదే!

Update: 2022-04-28 09:30 GMT
'ఆచార్య' సినిమా విడుదల సమయం చాలా దగ్గరికి వచ్చేసింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మాంఛి జోరుగా జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా  షూటింగు ఎక్కువ భాగం మారేడుమిల్లిలో జరిగింది. ఈ సినిమా షూటింగు సమయంలో చోటుచేసుకున్న అనేక అంశాలను గురించి తాజా ఇంటర్వ్యూలో కొరటాల - చరణ్ ప్రస్తావించారు. అడవిలోని ఒక వాగుకు అవతల గట్టున రెండు చిరుతలను .. ఇవతల గట్టున చిరూ - చరణ్ లకు సంబంధించిన ఒక స్టిల్ ను వదలగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఆ సింబాలిక్ షాట్ కి సంబంధించిన ప్రశ్న కొరటాలకి ఎదురు కాగా ఆయన స్పందిస్తూ .. "సినిమాలో చిరంజీవి .. చరణ్ తండ్రీ కొడుకులు కాదు .. అలాగని చెప్పేసి  గురు శిష్యులు కూడా కాదు. కానీ వాళ్లిద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఉండాలి.

చిరంజీవిగారు .. చరణ్ గారు ఇద్దరూ కూడా ఒక చిన్న ఎక్స్ ప్రెషన్ తో ఆ బాండింగ్ ను అద్భుతంగా ఆవిష్కరించారు. చిరుతలకి సంబంధించిన షాట్ కృతకంగా ఉండదు. కావాలని క్రియేట్ చేసినట్టుగా కూడా ఉండదు. కథలో నుంచి బయటికి వచ్చినట్టుగా ఉండదు.

చిరంజీవిగారు .. చరణ్ సిటీలో తిరుగుతున్నప్పుడు సడన్ గా చిరుతలను చూపిస్తే కావాలని పెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇద్దరూ కూడా అడవిలో తిరుగుతుంటారు .. అడవిలోనే పోరాటం చేస్తుంటారు. అందువలన ఆ షాట్ చాలా ఆర్గానిక్ గా అనిపిస్తుంది.

అడవిలో అలసిపోయిన వాళ్లిద్దరూ యేటి దగ్గరికి వచ్చి నీళ్లు తాగాలి. సరిగ్గా ఆ సమయానికే చిరుతలు  వచ్చి నీళ్లు తాగుతున్నాయి. అందువలన ఆ షాట్ చాలా ప్యూర్ గా వచ్చింది. ఫారెస్టులో చాలా త్వరగా లైటింగ్ పోతుంది.  అందువలన 15 నిమిషాల్లోనే ఈ షాట్ ను తీయడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.

అప్పుడు చరణ్ జోక్యం చేసుకుంటూ .. "ఆ షాట్ ను చేస్తున్నప్పుడు మాకేమీ పెద్దగా అనిపించలేదు. ఆ షాట్ ను చాలా కంగారు  .. కంగారుగా  చేయడం జరిగింది. ఆ షాట్ గురించి నాకు అర్థం కాలేదు. 'ఏంటి సార్' అని నేను కొరటాల గారిని అడిగాను. అప్పటికి లైటింగ్ పోతుంది గనుక, నాకు హడావిడిగానే చెప్పారు. హెవీ సెటప్  .. సింపుల్ షాట్ .. చెప్పడానికి ఆయనకి సమయం లేదు. ఆ తరువాత  ఆ లొకేషన్ నుంచి వెళుతూ అడిగితే అప్పుడు చెప్పారాయన. ఆ షాట్ ఇంత  ఇంపాక్ట్ చూపిస్తుందని ఆయనకి మాత్రమే తెలిసుంటుంది" అని అన్నాడు.
Tags:    

Similar News