అందుకే తెలుగు సినిమాలు చేయడం మానేశాను!

Update: 2022-02-08 06:54 GMT
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మాళవిక ఒకరు. తమిళ సినిమాతో తన కెరియర్ ను మొదలు పెట్టిన ఆమె, ఆ తరువాత 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ - వడ్డే నవీన్ కథానాయకులుగా నటించారు. తొలి సినిమాతోనే హిట్ తో పాటు ఎంతోమంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె చేసిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో, సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెడుతూ వెళ్లారు.

తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"నా అసలు పేరు శ్వేత కున్నూర్ మీనన్. తమిళంలో నా మొదటి సినిమా 'ఉన్నై తేడి' .. ఆ సినిమాకి దర్శకుడు సుందర్ సి  .. ఆయనే నా పేరును మాళవికగా మార్చారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో 5 .. తమిళంలో 35 సినిమాలు చేశాను. పూణే కాలేజ్ లో నేను చదువుతున్న రోజుల్లోనే యాడ్స్ లో చేసే అవకాశం వచ్చింది. అప్పుడే సినిమాల్లో చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ దిశగా ప్రయత్నించడం వలన 'ఉన్నై తేడి' సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఆ సినిమా చేసిన తరువాత మళ్లీ చదువు కొనసాగించాలని అనుకున్నాను. కానీ ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో ఇక వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాను. 'ఈవీవీ గారు 'చాలా బాగుంది' సినిమాతో నాకు ఫస్టు ఛాన్స్ ఇచ్చారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నిజంగా ఆయన చాలా గొప్ప డైరెక్టర్. ఆ తరువాత నాకు తెలుగు నుంచి చెప్పుకోదగిన పాత్రలు రాలేదు. 'చాలా బాగుంది' సినిమాలో మాదిరిగా నటనకి అవకాశం ఉన్న పాత్రలు పడలేదు. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వచ్చాయి. అవి నచ్చకపోవడం వల్లనే చేయలేదు.

హీరోయిన్ గా నేను ఒక పదేళ్లు తెరపై కనిపించాను. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నాను. పెళ్లి .. ఇద్దరు పిల్లలు .. వాళ్ల ఆలనా పాలన చూస్తూ ఇంటిపట్టునే ఉండిపోయాను. తల్లి పాత్రను .. హీరోయిన్ గా కెరియర్ ను పోల్చి చెప్పలేను.  హీరోయిన్ గా నా కెరియర్ కూడా చాలా సంతృప్తిని ఇచ్చింది. చాలా తక్కువ సమయంలో నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నానే అనే బాధ నాకు ఎప్పుడూ కలగలేదు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే నాకు నచ్చిన పాత్రలు .. నా స్థాయికి తగిన పాత్రలు వస్తేనే చేస్తాను" అని  చెప్పుకొచ్చారు.      
Tags:    

Similar News