అరవింద్ స్వామికి అప్పుడు పక్షవాతం వచ్చిందట

Update: 2018-10-14 09:21 GMT
తమిళ కథానాయకుడు అరవింద్ స్వామి అందానికి ప్రతిరూపంలా కనిపిస్తాడు. కెరీర్ ఆరంభంలో ‘రోజా’.. ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో అయినా.. ఈ మధ్య ‘ధృవ’.. ‘నవాబ్’ లాంటి సినిమాల్లో అయినా అరవింద్ అందానికి ఫిదా అవ్వని వాళ్లు లేరు. కానీ మధ్యలో కొన్నేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న సమయంలో అరవింద్ చూడ్డానికి గుర్తు పట్టలేనట్లుగా తయారయ్యాడు. నెత్తిన జుట్టంతా పోయి.. బాగా బరువు పెరిగిపోయి.. ఎబ్బెట్టుగా తయారయ్యాడు అరవింద్. ఐతే ఇదంతా అరవింద్ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదట. అతను తీవ్ర అనారోగ్యం పాలవడం వల్లే అలా తయారయ్యాడట. ఒక దశలో అతడికి పక్షవాతం కూడా వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు అరవింద్.

1999లో ‘సఖి’ సినిమాలో నటించాక అరవింద్ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పటికే తన తల్లిదండ్రులు చనిపోవడంతో తమ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్ని చూసుకోవాల్సి వచ్చిందని.. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. అనుకున్నట్లే వ్యాపారాలన్నీ చక్కదిద్దానని.. అలాంటి సమయంలో తనకు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందని అరవింద్ తెలిపాడు. ఆసుపత్రిలో చేరి మూడు రోజుల తర్వాత బెడ్ మీది నుంచి లేవబోతుంటే కుడి కాలు కదల్లేదని.. డాక్టర్లు పక్షవాతం వచ్చిందని చెప్పారని అతనన్నాడు. ఎన్నెన్నో చికిత్సలు.. ఏవేవో మందుల తర్వాత ఏడాదికి కానీ తాను కాలు కొంచెం కదపలేని స్థితికి చేరుకున్నట్లు చెప్పాడు. మందుల ప్రభావం, మంచానికే పరిమితం కావడం వల్ల తన బరువు 110 కిలోలకు చేరిందన్నాడు.

ఐతే ఇవేమీ తెలియకుండా సోషల్ మీడియాలో జనాలు తన పాత-కొత్త ఫొటోలు పెట్టి మీమ్స్ తయారు చేశారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తానేమీ బాధ పడలేదని.. కానీ తన కూతుర్ని తీసుకుని శ్రీలంకకు వెకేషన్‌ కు వెళ్తే అక్కడో అమ్మాయి.. ‘మీ నాన్నని తక్కువ తినమను’ అని ఎగతాళిగా మాట్లాడటం.. తన పాప ఏడవడంతో తనను చాలా బాధ పెట్టిందని అరవింద్ చెప్పాడు. ఐతే మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం తనను మళ్లీ పిలవడం.. అప్పుడు బరువు తగ్గే ప్రయత్నం చేయడంతో మళ్లీ మామూలు స్థితికి వచ్చానని.. ఆ తర్వాత మరింత పట్టుదల పెరిగి వ్యాయామాలు పెంచడంతో ఇంకా బాగా తయారయ్యానని.. వెన్నునొప్పిని కూడా లెక్క చేయకుండా కసరత్తులు కొనసాగిస్తున్నానని అతన చెప్పాడు.
Tags:    

Similar News