ఒరిజినల్ కంటెంటుకే పట్టం కడుతున్న ప్రేక్షకులు..!

Update: 2022-11-12 08:30 GMT
కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మరియు సినిమాల ఎంపికలో వారి ఆలోచనా విధానం పూర్తిగా మారిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఓటీటీలలో విస్తృతమైన కంటెంట్ కు అలవాటు పడిపోయిన జనాలు.. ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప థియేటర్స్ వైపు చూడటం లేదు. ముఖ్యంగా ఒరిజినల్ కంటెంట్ ను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. రీమేక్ చిత్రాలకు మంచి టాక్ వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఒకప్పుడు సినిమాకి సానుకూలమైన రివ్యూలు - పాజిటివ్ టాక్ వస్తే దానికి తగ్గట్టుగా ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చేవి. ఫస్ట్ వీకెండ్ లోనే మెజారిటీ భాగం రికవరీ చేసుకునేవారు. ఆ తర్వాత మౌత్ టాక్ తో పాటుగా.. మేకర్స్ ప్లాన్ చేసుకునే ప్రమోషన్స్ ని బట్టి వీక్ డేస్ లో వసూళ్లు ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హిట్ టాక్ వచ్చిన సినిమాలు.. పాజిటివ్ రివ్యూలు అందుకున్న చిత్రాలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రానికి తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఫైనల్ రన్ ముగిసే నాటికి బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేకపోయింది. అలానే దసరా సందర్భంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాకి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ పార్టీ కూడా చేసారు. కానీ క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే.. చివరికి బ్రేక్ ఈవెన్ కు దూరంలో నిలిచిపోయి లాస్ వెంచర్ గా మిగిలిపోయింది.

అలానే దీపావళి సందర్భంగా విడుదలైన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా!' సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. దీంతో మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇటీవల వచ్చిన అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. కానీ దీనికి తగ్గట్టుగా వసూళ్లు లేవు.

యూత్ ని ఆకట్టుకునే అంశాలు.. కావాల్సినంత కామెడీ ఉన్నా జనాలు పెద్దగా థియేటర్లకు రావడం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఫైనల్ గా యావరేజ్ బొమ్మగా మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా చాలా వరకు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చుపించాలేకపోయాను. అయితే ఈ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే.. ఇవన్నీ రీమేకులే.

రీమేక్ సినిమాల పట్ల జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఈ సినిమాని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. తెలుగు సినిమాల పరిస్థితన్నా ఒకాడికి అంతో ఇంతో నయం అనిపిస్తుంది. హిందీ రీమేక్ చిత్రాలనైతే నార్త్ ఆడియన్స్ కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తున్నారు. 'గద్దలకొండ గణేష్' 'జెర్సీ' 'హిట్ 2' 'హెలెన్' 'విక్రమ్ వేదా' లాంటి రీమేక్ సినిమాలు అక్కడ కనీస ఆదరణ దక్కించుకోలేకపోయాయి.

అదే సమయంలో 'RRR' 'ది కాశ్మీర్ ఫైల్స్' 'భూల్ భులైయా 2' 'కెజిఎఫ్ 2' 'చార్లీ 777' 'కార్తికేయ 2' 'సీతా రామం' 'కాంతార' లాంటి సినిమాలకు దాదాపు అన్ని భాషల్లోనూ బ్రహ్మరథం పట్టారు. 'కాంతార' లాంటి డబ్బింగ్ సినిమాని ఆదరించిన తెలుగు ఆడియన్స్.. టాలీవుడ్ హీరోల సినిమాల పట్ల ఆసక్తి చూపకపోవడానికి కారణం అవి రీమేక్ చిత్రాలు కావడమే అని స్పష్టమవుతోంది.

మంచి కంటెంట్ ఉన్నా రీమేక్ మూవీ కావడంతో.. ఆల్రెడీ ఏదొక ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జనాలు చూసేస్తున్నారు. అందుకే థియేటర్ల వరకూ వెళ్లి ఆ సినిమాల కోసం డబ్బులను ఖర్చు చేయాలని అనుకోవడం లేదు. ఏమేమి మార్పులు చేర్పులు చేసారో అని ఓటీటీలోకి వచ్చిన తర్వాత గానీ చూడటం లేదు. అదే ఒరిజినల్ కంటెంట్ అయితే భాషతో సంబంధం లేకుండా పట్టం కడుతున్నారని 'కాంతారా' ని ఉదాహరణగా తీసుకొని చెప్పొచ్చు.

కానీ రీమేక్స్ ఇప్పట్లో బ్రేక్స్ పడేలా లేవు. ప్రస్తుతం తెలుగులో అనేక చిన్న పెద్ద రీమేక్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమలు మాత్రమే ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నాయి. తమిళ్ - మలయాళ - కన్నడ వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ మీద ఆధారపడుతున్నారు. రీమేకుల జోలికి పోకుండా, ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు ఎలాంటి కంటెంట్ ను ఆదరిస్తున్నారో తెలుసుకుని.. సినిమాలు తీస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇటీవలి చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News