మూవీ రివ్యూ : ఫ్యామిలీ మ్యాన్-2

Update: 2021-06-05 09:41 GMT
చిత్రం  : ‘ఫ్యామిలీ మ్యాన్-2’

నటీనటులు: మనోజ్ బాజ్ పేయి-సమంత అక్కినేని-షరీబ్ హష్మి-షాహబ్ అలీ-రవీంద్ర విజయ్-దేవదర్శిని తదితరులు
సంగీతం: సచిన్-జిగార్
ఛాయాగ్రహణం: కామెరాన్ ఎరిక్ బ్రైసన్
రచన: రాజ్-డీకే-సుమన్ కుమార్
నిర్మాతలు: రాజ్-డీకే
దర్శకత్వం: రాజ్-డీకే-సుపర్ణ్ ఎస్.వర్మ

ఇండియాలో ఇప్పటిదాకా రూపొందిన వెబ్ సిరీసుల్లో కంటెంట్ పరంగా అయినా.. ఆదరణ పరంగా ‘ది బెస్ట్’ అంటే ‘ఫ్యామిలీ మ్యాన్’యే అని ఎవ్వరైనా చెప్పేస్తారు. వెబ్ సిరీస్‌ లకు పెద్దగా అలవాటు పడని కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఘనత ఈ షో సొంతం. బాలీవుడ్లో మంచి పేరు సంపాదించిన తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే.. అమేజాన్ ప్రైమ్ కోసం తీర్చిదిద్దిన వెబ్ సిరీస్ ఇది. రెండేళ్ల కిందటి తొలి సీజన్ కు కొనసాగింపుగా రాజ్-డీకే రూపొందించిన రెండో సీజన్ మీద అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఆ అంచనాలకు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అందుకుందో లేదో చూద్దాం పదండి.

ముందుగా కథలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీ మీద ఉగ్రవాదుల రసాయన దాడిని శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పేయి) అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ.. అప్పటికే గ్యాస్ లీక్ కావడం వల్ల 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారు. వేల మంది ప్రాణాలు కాపాడినప్పటికీ.. పూర్తిగా దాడిని ఆపలేకపోయామన్న అపరాధ భావం శ్రీకాంత్ టీంను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ కారణాలు కూడా తోడై శ్రీకాంత్.. ‘టాస్క్’కు దూరం అవుతాడు. భార్యాపిల్లలు కోరుకున్నట్లే ఒక ఐటీ కంపెనీలో 9-5 ఉద్యోగంలో చేరతాడు. అయిష్టంగానే ఆ ఉద్యోగం చేస్తూ ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ.. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తుంటాడు. ఐతే మళ్లీ ‘టాస్క్’ టీంకు ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. శ్రీలంకలో తమిళుల స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఎల్టీటీఈకి చెందిన బృందం.. పాకిస్థాన్ ఐఎస్ఐతో కలిసి భారత ప్రధాని మీద దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. దీనికి తోడు వేరే కారణాలు కూడా తోడై శ్రీకాంత్ మళ్లీ ‘టాస్క్’లోకి రాక తప్పదు. ఈ స్థితిలో తన టీంతో కలిసి ప్రధానిపై దాడిని శ్రీకాంత్ ఎలా అడ్డుకున్నాడన్నది మిగతా కథ.

ఇండియాలో పెద్ద విజయం సాధించిన సినిమాలకు కొనసాగింపుగా తీసిన సీక్వెల్స్ లో చాలా వరకు నిరాశకు గురి చేసినవే. ముందు పెద్దగా అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాక వాళ్లు పెట్టుకున్న భారీ అంచనాలను సీక్వెల్ తో అందుకోవడంలో ఫిలిం మేకర్స్ తడబడుతుంటారు. ఐతే తాము తీసిన సినిమాలను మించిన కథాకథనాలతో ‘ఫ్యామిలీ మ్యాన్’ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రాజ్-డీకే.. సీక్వెల్ విషయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా అంతే పకడ్బందీగా రూపొందించారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ ఎలా అయితే ఓవైపు ఉత్కంఠ రేపుతూ.. మరోవైపు అక్కడక్కడా కుటుంబ అంశాలతోనూ ఆసక్తి రేకెత్తిస్తూ.. ఇంకోవైపు సమయోచితంగా వినోదం అందిస్తూ సాగుతుందో.. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సైతం అదే తరహాలో ఆకట్టుకుంటుంది. తొలి సీజన్ చూసి ఉండటం వల్ల కథ పరంగా సెకండ్ సీజన్ మరీ కొత్తగా అనిపించదు. పైగా అందులో మాదిరి విలన్ పాత్రకు సంబంధించి ఇక్కడ సర్ప్రైజ్ ఉండదు. కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. ఐతే ఇవేవీ పెద్ద తప్పుల్లా కనిపించని విధంగా తొమ్మిదికి తొమ్మిది ఎపిసోడ్లలోనూ ప్రేక్షకుల దృష్టి మరలని విధంగా.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ‘ఫ్యామిలీ మ్యాన్-2’.

‘ఫ్యామిలీ మ్యాన్-1’కు టెర్రరిస్టు మూసా పాత్ర పెద్ద ఆకర్షణ. అమాయకంగా మొదలైన ఆ పాత్ర.. చివరికి అసలు రూపం చూపించేసరికి ప్రేక్షకులు మామూలుగా థ్రిల్ అవ్వరు. ఆ షోను మరో స్థాయికి తీసుకెళ్లిన ట్విస్టు ఇది. ఐతే ఈసారి ప్రధాన విలన్ పాత్రలోకి సమంతను తీసుకొచ్చారు. సమంత పాత్ర విషయంలో ముందే ఒక అంచనాకు వచ్చేశాక అక్కడి నుంచి ట్విస్టులు.. సర్ప్రైజులు ఆశించడానికి వీల్లేకపోయింది. ఈ కోణంలో చూస్తే సమంతను ఎంచుకోవడం షోకు మైనస్ అయినట్లే. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంత పాత్రే అది పెద్ద ఆకర్షణగా మారిందంటే అది ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం వల్లే. సమంత చేసిన రాజి పాత్ర మొదలైన తొలి సన్నివేశం నుంచి ఆ క్యారెక్టర్ ముగిసే వరకు ఒక్క చోట కూడా స్క్రీన్ కు కళ్లప్పగించేసేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. శ్రీలంక సైన్యం చేసిన అరాచకాలకు సర్వస్వం కోల్పోయి తన జాతి కోసం ఏదో ఒకటి చేయాలని ఎల్టీటీఈలో చేరి తక్కువ వ్యవధిలో ప్రమాదకర తీవ్రవాదిగా మారిన పాత్రలో సమంత స్టీల్ ద షో అనే చెప్పాలి.

కేవలం రాజి పాత్ర.. ఆ క్యారెక్టర్లో సమంత పెర్ఫామెన్స్ కోసమే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. ఒక మామూలు అమ్మాయిలా పరిచయం చేసి.. ఆ తర్వాత ఆ పాత్ర తాలూకు అసలు స్వరూపాన్ని బయటపెట్టే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. హీరోను మించిన ఎలివేషన్ ఉంటుంది ఈ పాత్రకు. పాత్ర తాలూకు నిగూఢత్వాన్ని తన హావభావాలతో సమంత పలికించిన వైనానికి ఫిదా అయిపోతాం. ముఖ్యంగా వేర్వేరు సందర్భాల్లో తనను అనుభవించాలని చూసే ముగ్గురు మగాళ్లతో సమయానుకూలంగా ఆమె వ్యవహరించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పాత్ర డిమాండ్ మేరకు సమంత కెరీర్లోనే ఎన్నడూ లేనంత విధంగా డీ గ్లామరస్ గా.. అలాగే ఎంతో ‘బోల్డ్‌’గా నటించిన సమంత ‘వావ్’ అనిపిస్తుంది. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఇలాంటి సాహసం ఇప్పటిదాకా ఇంకెవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు.

ఇక ‘ఫ్యామిలీ మ్యాన్-1’ను తన భుజాల మీద నడిపించిన మనోజ్ బాజ్ పేయి రెండో సీజన్లోనూ అదరగొట్టేశాడు. ఎంతో సీరియస్ గా కనిపిస్తూ అతను కామెడీ పండించిన తీరు మరోసారి షోకు హైలైట్ గా నిలిచింది. తొలి సీజన్ తో పోలిస్తే మనోజ్ పాత్ర ఈసారి మరింత వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా శ్రీకాంత్ అభీష్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఐటీ కంపెనీలో.. బాస్ తో ముడిపడ్డ సన్నివేశాలు భలేగా ఎంటర్టైన్ చేస్తాయి. ఆ ఉద్యోగం వదిలి వెళ్లిపోయేటపుడు బాస్ పని పట్టే సన్నివేశాలకు థియేటర్లలో అయితే మామూలు రెస్పాన్స్ ఉండదు. అలాగే భార్యతో కలిసి సైకియాట్రిస్టును కలిసినపుడు శ్రీకాంత్ పాత్ర ప్రవర్తన సైతం నవ్విస్తుంది. టెర్రరిస్ట్ ఆపరేషన్.. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన కథంతా సీరియస్ గా సాగినప్పటికీ.. శ్రీకాంత్ సీరియస్ గానే పంచులు వేస్తూ వినోదం పంచుతుంటుంది. అదే సమయంలో కొన్ని సన్నివేశాల్లో మనోజ్ ఎమోషన్లను కూడా అద్భుతంగా పండించాడు. శ్రీకాంత్ పాత్రను అండర్ ప్లే చేస్తూనే అది సమయానుకూలంగా ఎలివేట్ అయ్యేలా ఎపిసోడ్లను తీర్చిదిద్దారు దర్శకుడు రాజ్-డీకే. మనోజ్ తనదైన శైలిలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ప్రేక్షకుల మనసులపై శ్రీకాంత్ పాత్ర చెరగని ముద్ర వేస్తుంది.

‘ఫ్యామిలీ మ్యాన్’ థ్రిల్లర్ వెబ్ సిరీసే కానీ.. మిగతా షోలతో పోలిస్తే ఇందులో ప్రత్యేకంగా కనిపించేది ఇందులో ఫ్యామిలీ ఎమోషన్లు.. వినోదానికి ఢోకా లేకపోవడమే. థ్రిల్.. ఎమోషన్లు.. ఫన్.. ఈ మూడింటినీ రాజ్-డీకే బ్యాలెన్స్ చేసిన తీరు షోకు హైలైట్ గా నిలిచింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లోనూ ఇదే సమతూకం పాటించారు. శ్రీకాంత్ కుటుంబ నేపథ్యంలో ఎమోషన్లు బాగానే పండాయి. పతాక సన్నివేశాల్లో శ్రీకాంత్ కూతురి పాత్ర కిడ్నాప్ ఎపిసోడ్ బాగా పండింది. అలాగే సమంత పాత్రకు సంబంధించిన ఎమోషనల్ యాంగిల్ ను కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇక ఏ చిన్న అవకాశం దక్కినా కామెడీ పండించడానికి ఉపయోగించుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో తొమ్మిది ఎపిసోడ్లుంటే.. ప్రతి భాగంలోనూ ఉత్కంఠకు లోటు ఉండదు. ఎక్కడో ఒక మెరుపు లాంటి సన్నివేశం పడుతుంది. ఎల్టీటీఈ లీడర్.. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత ప్రధానిపై దాడికి సిద్ధపడటం అనే కల్పనను కొంచెం జీర్ణించుకోగలిగితే పక్కన పెడితే.. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఎక్కడా బోర్ కొట్టించదు. శ్రీకాంత్.. అతడి ఫ్యామిలీ నేపథ్యంలో ఓ కథను నడిపిస్తూ.. ఇంకోవైపు రాజి ఎపిసోడ్ చూపిస్తూ.. మరోవైపు అంతర్జాతీయ రాజకీయ అంశాలను టచ్ చేస్తూ స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా చేసుకున్నారు రాజ్-డీకే. ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా ఇన్వెస్టిగేషన్ సీన్లను వాస్తవికంగా.. ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. శ్రీకాంత్ కుటుంబ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త నెమ్మదిగా నడుస్తాయి. ప్రియమణి పాత్ర అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. ఆమె పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దాల్సింది. అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదించడం తప్పితే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అంచనాలను అందుకోవడంలో విజయవంతమైంది. తొలి సీజన్ చూడని వాళ్లను సైతం ఇది ఆకట్టుకుంటుంది. ‘ఫ్యామిలీ మ్యాన్-1’ చూస్తే దీన్ని మరింత ఎంజాయ్ చేయొచ్చు.

చివరగా: ఫ్యామిలీ మ్యాన్-2.. మిషన్ మళ్లీ సక్సెస్

రేటింగ్-3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News