'ది ఘోస్ట్' మూవీ రివ్యూ

Update: 2022-10-05 12:41 GMT
'ది ఘోస్ట్' మూవీ రివ్యూ
నటీనటులు: అక్కినేని నాగార్జున-సోనాల్ చౌహాన్-గుల్ పనాగ్-అనైక సురేంద్రన్-జయప్రకాష్-రవి వర్మ-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: మార్క్ కే రాబిన్-భరత్-సౌరభ్
ఛాయాగ్రహణం: ముఖేష్.జి
అడిషనల్ స్క్రీన్ ప్లే: అబ్బూరి రవి-అభిజిత్
నిర్మాతలు: సునీల్ నారంగ్-పుస్కూర్ రామ్మోహన్ రావు-శరత్ మరార్
రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

కొంత కాలంగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు 'ది ఘోస్ట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గరుడవేగ'తో తనపై అంచనాలు పెంచిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా బుధవారమే థియేటర్లలోకి దిగింది. మరి ఈ చిత్రం నాగ్ కోరుకున్న విజయం అందించేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

విక్రమ్ (అక్కినేని నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్. అండర్ వరల్డ్ మాఫియాను టార్గెట్ చేసి అందరూ తన శరణు కోరేలా చేసిన విక్రమ్.. కొన్ని కారణాల వల్ల తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అతడి జీవిత భాగస్వామి.. సహోద్యోగి అయిన ప్రియ (సోనాల్ చౌహాన్) కూడా తనకు దూరం అవుతుంది. ఇంటర్ పోల్ అధికారులు కోరినపుడు ఫ్రీలాన్స్ సేవలు అందిస్తున్న అతడికి చాలా ఏళ్లుగా తమ కుటుంబానికి దూరంగా ఉన్న తన సోదరి అను (గుల్ పనాగ్) నుంచి ఒక రోజు ఫోన్ వస్తుంది. తాను.. తన కూతురు అదితి ప్రమాదంలో ఉన్నట్లు ఆమె చెప్పడంతో తన పనులన్నీ పక్కన పెట్టి ఆ కుటుంబం రక్షణ బాధ్యత తీసుకుంటాడు విక్రమ్. అతనెంత ప్రయత్నం చేసినప్పటికీ.. అను ప్రాణాలు కోల్పోతుంది. అదితి ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. మరి అను కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది ఎవరు? వారిని విక్రమ్ కనిపెట్టాడా.. అదితిని కాపాడుకున్నాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'ది ఘోస్ట్' విడుదలకు చాలా రోజుల ముందే ఈ చిత్రంలో హీరో వాడే ఆయుధం గురించి ఒక స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ఆయుధం గురించి జనాలు చర్చించుకునేలా చేశారు. హీరో వాడే వెపనే అంత పవర్ ఫుల్ అయినపుడు.. హీరో ఇక ఎంతటి వాడో అనుకుంటాం. ఇక 'ది ఘోస్ట్' సినిమా ఆరంభమైన దగ్గర్నుంచి హీరో మామూలోడు కాదు అనే సంకేతాలే ఇస్తుంటారు. అతడికి దయాదాక్షిణ్యాలన్నవే ఉండవని.. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న మాఫియా డాన్లంతా వచ్చి అతడి కాళ్ల మీద పడి శరణు కోరారని కొన్ని షాట్ల ద్వారా చూపిస్తుంటారు. అంతగా హీరో ఏం చేసేశాడో చూద్దాం అని చాలాసేపు ఎదురు చూస్తారు ప్రేక్షకులు. తీరా చూస్తే.. హీరో సింపుల్ గా రెండు ఫైట్లు చేస్తాడంతే. ఆ ఫైట్లు చాలా స్టైలిష్ గా అయితే డిజైన్ చేశారు. కానీ వాటికి ముందు ఒక బిల్డప్ లేదు. ఆ యాక్షన్ సీన్లు నడుస్తుండగా ఒక ఎమోషన్ లేదు. ఎలివేషన్ లేదు. హీరో వస్తాడు. అందరినీ చంపి పడేస్తాడు. అంతే.. మాఫియా డాన్లంతా వచ్చి అతడి కాళ్ల మీద పడిపోతారు. అసలు విలన్లు ఎంత పవర్ ఫుల్లో చూపించకుండా.. హీరో వాళ్ల మీద అంతగా రెచ్చిపోవడానికి బలమైన కారణాలు చూపించకుండా.. వరల్డ్ క్లాస్ యాక్షన్ కొరియోగ్రఫీ.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ జోడించినంత మాత్రాన ఆ సన్నివేశాలు ఎలివేట్ అయిపోతాయనుకుంటే ఎలా? ఈ ఎపిసోడ్ అనే కాదు.. మొత్తంగా 'ది ఘోస్ట్' మూవీతో ఉన్న సమస్యే ఇది. ఇందులో యాక్షన్ ఘట్టాలు చాలా బాగా డిజైన్ చేశారని పొగుడుకోవాల్సిందే తప్ప.. బలమైన కథ లేదు.. ఎంగేజ్ చేసే కథనం లేదు. అసలు ఇది మన కథ అని ఓన్ చేసుకునే అంశాలే లేవు ఇందులో.

'గరుడవేగ' సినిమా కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆడి ఉండకపోవచ్చు. కానీ రాజశేఖర్ లాంటి అసలు ఫాంలో లేని హీరోను పెట్టి ఆశ్చర్యపరిచే కథతో.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనంతో ఆ సినిమాను ప్రవీణ్ సత్తారు నడిపించిన తీరు అసామాన్యం. ఐతే అందులో అందరూ రిలేట్ చేసుకునే కథతో మెప్పించిన ప్రవీణ్.. ఈసారి స్టోరీ దగ్గరే పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు. 'గరుడవేగ'లో మాదిరి ఒక థ్రిల్లర్ కథకు ఫ్యామిలీ ఎమోషన్లు కూడా జోడించాలని అతను చేసిన ప్రయత్నం బెడిసికొట్టేసింది. 'ది ఘోస్ట్' అనే టైటిల్.. ట్రైలర్ చూసి ఏదో ఊహించుకుని థియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు అక్కడ కనిపించేది వేరు. హీరో చేసే ఆపరేషన్ల నేపథ్యంలో ఏదైనా పెద్ద టాస్క్ ఉంటుందేమో.. దాని చుట్టూ కథ ఉత్కంఠభరితంగా నడుస్తుందేమో అనుకుంటే.. ఫ్యామిలీ యాంగిల్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. హీరో తన సోదరి.. ఆమె కుటుంబాన్ని శత్రువుల నుంచి కాపాడ్డమే ఇక్కడ మెయిన్ ప్లాట్ పాయింట్ గా మారింది. మిగతా విషయాలు సబ్ ప్లాట్స్ గా మారాయి. అసలు హీరోకు మొదట్లో ఇచ్చిన బిల్డప్ ఏంటి.. అతడి రేంజేంటి.. అతను చేస్తున్న ఆపరేషన్ ఏంటి అని అర్థం కాకుండా అయోమయానికి గురయ్యేలా ఈ వ్యవహారం నడుస్తుంది. హీరో సోదరి కుటుంబ గొడవలు.. వ్యాపార రాజకీయాలు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. ఇక ఆమె కూతురికి హీరో బాడీ గార్డుగా మారడం.. ఆమె అల్లరి వేషాలు.. ఒక పెద్ద ప్రమాదం తప్పాక ఆమెలో మార్పు రావడం.. ఈ ట్రాక్ అంతా కూడా చాలా బోరింగ్ గా సాగుతుంది. ప్రథమార్ధం ముగిసేసరికే ప్రేక్షకులు ఈ కథతో ఏమాత్రం కనెక్ట్ కాని సినిమా నడుస్తుంది.

హీరోకు అక్కడక్కడా ఇచ్చిన బిల్డప్ చూసి.. కనీసం హీరో ఫ్లాష్ బ్యాక్.. మాఫియాతో అతడి ఫైట్ అయినా ఎంగేజింగ్ గా ఉంటాయని ఆశిస్తే పైన చెప్పుకున్నట్లు అది కేవలం రెండు యాక్షన్ సన్నివేశాలకు పరిమితం అయింది. హీరో గురించి విలన్ మాటల్లో ఇచ్చే బిల్డప్.. ఎలివేషన్లకు మనం చూసిన సన్నివేశాలకు పొంతన కనిపించదు. అతడి వీరత్వాన్ని మనం ఫీల్ కాలేం. ఇక ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని వర్తమానంలోకి వచ్చాక జరిగే తంతు మరింత పేలవంగా అనిపిస్తుంది. హీరో సోదరి వెనుక జరిగిన కుట్రలు.. వాటి తాలూకు మిస్టరీని ఛేదించే క్రమం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఆ రాజకీయాలు అర్థం కాని విధంగా.. అయోమయంగా అనిపిస్తాయి. ప్రేక్షకులు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతారు ఆ ఎపిసోడ్లలో. ఆఖర్లో వచ్చే యాక్షన్ ఘట్టాలు.. హీరో ఎలివేషన్ బాగానే అనిపించినా.. ఆ పాత్రతో.. కథతో అప్పటికే డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల పెద్దగా కిక్కేమీ రాదు. చివరికి వచ్చేసరికి దర్శకుడు ఈ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాదు. ప్రవీణ్ సత్తారు నుంచి ప్రేక్షకులు ఆశించిన ఏ అంశాలూ ఇందులో లేవు. యాక్షన్ సన్నివేశాల్లో మినహాయిస్తే కథాకథనాల్లో అతడి ముద్ర కనిపించలేదు.

నటీనటులు:

ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో అక్కినేని నాగార్జున ఓకే అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన గ్రేస్ చూడొచ్చు. అదే సమయంలో మెర్సీలెస్ కాప్ పాత్రలో నాగ్ అనుకున్నంత ఫెరోషియస్ గా కనిపించలేదనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో.. హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో నాగ్ మరింత ఎనర్జీ చూపించాల్సింది. ఐతే ఈ వయసులో కాప్ పాత్రకు యాప్ట్ అనిపించే ఫిజిక్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చినందుకు మాత్రం నాగార్జునను అభినందించాల్సిందే. హీరోయిన్ సోనాల్ చౌహాన్ రోల్ కు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆమెకు పెద్దగా పెర్ఫామ్ చేసే స్కోప్ దక్కలేదు. గుల్ పనాగ్ కీలక పాత్రలో బాగానే చేసింది. అనైక సురేంద్రన్ చలాకీ నటనతో ఆకట్టుకుంది. విలన్ పాత్రధారులంతా కొత్తవాళ్లే. అందరూ ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'ది ఘోస్ట్' మెరుగ్గానే కనిపిస్తుంది. ముగ్గురు సంగీత దర్శకులు పని చేసిన సినిమాలో నేపథ్య సంగీతం బాగానే సాగింది. రెగ్యులర్ మాస్ సినిమాల్లో మాదిరి సౌండ్స్ ఇందులో వినిపించవు కానీ.. సన్నివేశాలకు తగ్గట్లు ఆర్ఆర్ కుదిరింది. హీరోయిజం ఎలివేటయ్యే సీన్లలో స్కోర్ బాగుంది. ముఖేష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ  అంచనాలను అందుకోలేకపోయాడు. అసలు ఈ కథే ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేదు. మనది కాని ప్రపంచంలో కథ నడుస్తున్న ఫీలింగ్ కలుగుతంది. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు పూర్తిగా ట్రాక్ తప్పేశాడనే చెప్పాలి.

చివరగా: ది ఘోస్ట్..  నో మెర్సీ ఆన్ ఆడియన్స్

రేటింగ్-2/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News