కరోనా పై యుద్ధానికి ముందుకొచ్చిన మంచు ఫ్యామిలీ!

Update: 2020-04-07 13:01 GMT
కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా, -టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్‌‌ లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు - కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు రంగంలోకి దిగి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. చిరంజీవి, -నాగార్జున - ప్రభాస్ - మహేష్ - ఎన్టీఆర్ - బాలయ్య.. ఇలా స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు - దర్శకనిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. మరికొంతమంది స్వయంగా పేద కళాకారులకు - కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు - కూరగాయలు - మందులు ఇచ్చి వారికి అండగా ఉంటున్నారు. కొంతమంది శానిటైజర్స్, -మాస్కులను పంపిణీ చేస్తూ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ యాక్టర్ మోహన్ బాబు.. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వివరాల్లోకి వెళ్తే మంచు మోహన్ బాబు - విష్ణు కలిసి కరోనా బాధితులను ఆదుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని గ్రామస్థుల అవసరాలను తీరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ గ్రామాలలోని పేదవారికి డైలీ రెండు పూటలా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసే దాకా మంచు ఫ్యామిలీ ఈ సహాయాన్ని కొనసాగిస్తారట. అంతేకాకుండా ప్రతిరోజూ ఎనిమిది టన్నుల కూరగాయలను ఆ గ్రామాలలో పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా సష్టించిన అలజడికి బలైపోయిన వారిలో కొంతమందిని మంచు ఫ్యామిలీ ఈ విధంగా ఆదుకుంటోంది. గతంలో కూడా మోహన్ బాబు చాలా సందర్భాల్లో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన విద్యాసంస్థలలో పేదవారికి ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. మంచు మనోజ్ సైతం కరోనా బాధితుల సహాయార్థం విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ తమ సేవాగుణాన్ని చాటుకున్నారని అందరూ అభినందిస్తున్నారు. ఏదేమైనా మంచు వారు పైకి చూడటానికి కఠినంగా కనిపించినా మనసు మాత్రం నిజంగానే మంచు లాంటిది అని అందరూ ఆయన చేసిన మంచి పనిని మెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News