మొన్న క్రిస్మస్ రోజున నయన్ ఏడుస్తూ ఉండిపోయిందా?

Update: 2020-01-12 03:55 GMT
నయన్ ఏమైనా చిన్నపిల్లా.. అదే పనిగా ఏడవటానికి? మొన్నటి క్రిస్మస్ రోజున ఆమె అదే పనిగా ఏడుస్తూ ఉండిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే..అది నిజమని.. ఆ విషయాన్ని నయనే చెప్పటం కనిపిస్తుంది. నయన్ తన బాధను ఆపుకోలేక క్రిస్మస్ రోజున ఏడుస్తూనే ఉన్నారంటూ కోలీవుడ్ వెబ్ సైట్లు అదే పనిగా కథనాలు రాసుకొచ్చాయి.

వెబ్ సైట్లు.. అందునా కోలీవుడ్ సైట్లు ఏమైనా రాసేయొచ్చన్న మాటను పుసుక్కున అంటే.. పాపం తగలటం ఖాయం. ఎందుకంటే.. నయన్ ఏడుపు విషయంలో వారు రాసింది అక్షర సత్యమన్న విషయాన్ని తాజాగా నయన్ మేడమ్ చెప్పేశారు. తన అంతులేని శోకం వెనుక వేదనను..వెతల్ని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ ప్రపంచంలోనే తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మరెవరో కారట.. ఆమె మేనకోడలు ఏంజెలీనా అన్న విషయాన్ని చెప్పిన నయన్.. ఆమెతో తనకున్న అద్భుతమైన రిలేషన్ ను చెప్పుకొచ్చారు. తన అన్న కుమార్తె పుట్టిన నాటి నుంచే తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయని చెప్పారు. అలాంటి ఆమెతో గత ఏడాది క్రిస్మస్ పండుగను జరపుకోలేకపోవటంతో అంతులేని బాధ తనను కమ్మేసిందన్నారు.

తను దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమెతో గడపలేనన్న వేదనతో ఆ రోజంతా తాను ఏడుస్తూనే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అయినా.. నయన్ అంత దానికి అంతలా ఏడవాలా? మా లాగా మీరేమైనా సాదాసీదా వ్యక్తులు కాదు కదా? మీరు కావాలనుకుంటే ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకొని అలా దుబాయ్ వెళ్లి.. ఇలా వచ్చేస్తే సరిపోయేది కదా? అంత మాత్రానికే మిస్ అయ్యారన్న వేదన ఉండేది కాదేమో? మనకీ ఆలోచన వచ్చింది కానీ.. నయన్ కు రాలేదేమో? ఒకవేళ వచ్చినా.. అలా చేయటానికి సైతం సాధ్యం కాలేదేమో? అందుకే.. అంతగా ఏడ్చి ఉంటారేమో?




Tags:    

Similar News