వివాదాస్పద సినిమాకి మృణాల్ రివ్యూ

కానీ మృణాల్‌ ఠాకూర్ మాత్రం తాను సినిమాను చూశాను, తన అభిప్రాయంను చెప్తాను అంటూ 'ఎమర్జెన్సీ'కి సంబంధించిన తన రివ్యూను ఇచ్చింది.

Update: 2025-02-12 10:03 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నెలల తరబడి వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలైంది. జనవరి 17న విడుదలైన 'ఎమర్జెన్సీ' సినిమా అనుకున్నట్లుగానే వివాదాస్పద అంశాలతో రూపొందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, ఎమర్జెన్సీ పరిస్థితులను గురించి కంగనా తన దర్శకత్వంలో చూపించే ప్రయత్నం చేసింది. తానే ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. సినిమా వివాదాస్పదం కావడంతో ప్రమోషన్ బాగానే జరిగింది. అయినా ఎమర్జెన్సీకి భారీ వసూళ్లు మాత్రం నమోదు కాలేదు. సినిమాకు ఒక వర్గం నుంచి పర్వాలేదు అనే టాక్‌ వచ్చినా ఓవరాల్‌గా ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరింది.

ఎమర్జెన్సీ మూవీ గురించి ఇండస్ట్రీకి చెందిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్పందించారు. కంగనా ఇండస్ట్రీలోని మెజార్టీ మెంబర్స్‌తో విభేదాలను కలిగి ఉంటుందని, అందుకే చాలా మంది ఎమర్జెన్సీ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు అనే అనుమానాలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఎమర్జెన్సీ సినిమా గురించి చాలా తక్కువ మంది పాజిటివ్‌గా మాట్లాడారు. ఇండస్ట్రీకి చెందిన వారు ఈ సినిమా గురించి మాట్లాడి వివాదాస్పదం కావడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారు. కానీ మృణాల్‌ ఠాకూర్ మాత్రం తాను సినిమాను చూశాను, తన అభిప్రాయంను చెప్తాను అంటూ 'ఎమర్జెన్సీ'కి సంబంధించిన తన రివ్యూను ఇచ్చింది.

మృణాల్ ఠాకూర్‌ 'ఎమర్జెన్సీ' గురించి మాట్లాడుతూ... నాన్నతో కలిసి కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమాను చూశాను. కంగనా అభిమానిగా నేను ఈ సినిమాను చూశాను. సినిమాను చూసిన తర్వాత ఆ అనుభూతి నుంచి వెంటనే బయటకు రాలేక పోయాను. ఈ సినిమాతో కంగనా మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాతో హద్దులు చెరిపేసి తన సత్తాను చాటారు. ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ నాకు బాగా నచ్చింది. నటిగానే కాకుండా దర్శకురాలిగానూ కంగనా విజయాన్ని అందుకున్నారు.

సినిమాలోని స్క్రీన్‌ప్లే, సంగీతం, మాటలు ఆకట్టుకున్నాయని, సినిమా స్థాయిని పెంచే విధంగా దర్శకత్వం ఉందని మృణాల్‌ చెప్పుకొచ్చింది. కంగనా ఒక నటి మాత్రమే కాదు, గొప్ప కళాకారిణి అంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది. కంగనా నిజంగా ఇలాంటి ఒక ప్రయోగంను చేసినందుకు అభినందనలు. ఇలాంటి సినిమాలను తప్పకుండా భారతీయులు అంతా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చేప్పుడు భావోద్వేగానికి గురి అవుతారని మృణాల్‌ ఠాకూర్ చెప్పుకొచ్చింది. సినిమా గురించి ఏ ఒక్క పాయింట్‌ వదలకుండా మృణాల్‌ అన్ని విషయాలను కవర్‌ చేసి ఎమర్జెన్సీకి పర్ఫెక్ట్‌ రివ్యూ ఇచ్చింది. కంగనా సినిమా గురించి మృణాల్‌ రివ్యూ ఇవ్వడం, అది కూడా చాలా పాజిటివ్‌ గా రివ్యూ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

Tags:    

Similar News