ఆ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
అందులో భాగంగానే చిత్ర డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశాడు.;
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే చిత్ర డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశాడు.
చెన్నై పోయెస్ గార్డెన్ లోని రజినీ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు పృథ్వీరాజ్. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పృథ్వీరాజ్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఎల్2: ఎంపురాన్ ట్రైలర్ ను అందరికంటే ముందు రజినీకాంత్ కు చూపించానని, ట్రైలర్ చూశాక ఆయన చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పృథ్వీరాజ్ తెలిపాడు.
రజినీకాంత్‌కు ఎప్పటికీ వీరాభిమానినే అంటూ పృథ్వీరాజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా సూపర్ స్టార్ రజినీపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని పలుసార్లు బయటపెట్టాడు పృథ్వీరాజ్. రజినీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తున్న పృథ్వీరాజ్ కు గతంలో ఆ ఛాన్స్ వచ్చినా డేట్స్ అడ్జస్ట్ అవకపోవడం వల్ల ఆ లెజెండ్ ను డైరెక్టర్ చేయలేకపోయినట్టు తెలిపాడు.
ఇక ఎల్2:ఎంపురాన్ విషయానికొస్తే ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీలో మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లూసీఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడంతో ఎల్2: ఎంపురాన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.