పిక్ టాక్: మెగాస్టార్ అమ్మలందరికి ఓ పెద్ద కొడుకే..
మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులకు గుండెల్లో చోటు దక్కించుకున్న వ్యక్తి;
మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులకు గుండెల్లో చోటు దక్కించుకున్న వ్యక్తి. ఇటీవల, యూకే పార్లమెంట్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనుండటంతో ఆయన లండన్ పర్యటన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ గౌరవాన్ని స్వీకరించేందుకు లండన్ వెళ్లిన చిరంజీవికి అక్కడ భారీ స్థాయిలో అభిమానుల స్వాగతం లభించింది. ప్రత్యేకించి, అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు ఆయనను ఘనంగా ఆహ్వానించారు.
చిరంజీవి కెరీర్ 150కి పైగా సినిమాలను దాటి, ఇప్పటికీ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూనే ఉన్నాడు. వెండితెరపై తన అద్భుతమైన ప్రతిభను చూపించడమే కాకుండా, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉండటం ఆయనను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న ఆయనకు ఇప్పుడు యూకే పార్లమెంట్ నుంచి మరో అంతర్జాతీయ స్థాయి గౌరవం దక్కడం గర్వించదగ్గ విషయం. ఇది కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాకుండా, భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే అంశంగా మారింది.
లండన్ విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవిని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ అనుబంధమైన ఘట్టం చోటుచేసుకుంది. తన తల్లిని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లిన ఓ అభిమాని, "చిన్నప్పుడు అమ్మ ని చిరంజీవిగారి దగ్గర కి తీసుకెళ్ళు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే నేను చిరంజీవిగారి దగ్గర కి తీసుకెళ్ళా. అమ్మ ఆనందానికి అవధులు లేవు." అంటూ ఒక ఫ్యాన్ ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు.
వయస్సు తో సంబంధం లేకుండా చిరంజీవి గారు అంటే ఒక ఏమోషన్. ఒక్క అంజనమ్మ కే కొడుకు కాదు. రాష్ట్రం లో ఎంతోమంది ఇళ్ళల్లో పెద్ద కొడుకు ఈ చిరంజీవి" అని ఎమోషనల్ మూమెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. చిరంజీవిని చూసి తన ఆనందాన్ని పంచుకుంటూ ఆ తల్లి ప్రేమతో ఆయనను ముద్దు పెట్టుకోవడం ఆ క్షణాన్ని మరింత భావోద్వేగపూరితంగా మార్చేసింది. ఈ అద్భుతమైన సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వయస్సుతో సంబంధం లేకుండా చిరంజీవి ఎప్పుడూ అదే ఎనర్జీ, అదే ప్రేమతో తన అభిమానులను ఆత్మీయంగా కలుసుకోవడం కొత్తేమీ కాదు. సినీ పరిశ్రమలో రారాజుగా కొనసాగుతున్న ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సాధారణంగా నటీనటులకు సినిమాల విజయం, రికార్డులు మాత్రమే ముఖ్యం. కానీ చిరంజీవి జీవితంలో అభిమానుల ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇదే ఇమోషన్ కనబడుతుంది. ఆ మాటకు వస్తే, ఆయనను అభిమానించే వారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ప్రస్తుతం చిరంజీవి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. 'విశ్వంభర' సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, తన తదుపరి సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి పనిచేయనున్నాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు తన సేవా కార్యక్రమాలు, ఇలా అన్ని రకాలుగా మెగాస్టార్ చిరంజీవి తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తూ అభిమానులను సంతోషపరుస్తున్నారు.