టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు లోకేష్ ను చూసి నేర్చుకోవాల్సిందే!

దీని వ‌ల్ల వ‌రుస సినిమాలు లేక ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ‌డంతో పాటూ నిర్మాత‌ల‌కు కూడా ఖ‌ర్చు ప‌రంగా భారం పెరుగుతుంది.;

Update: 2025-03-18 13:30 GMT

సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో స‌క్సెస్ అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డంతో మేక‌ర్స్ ప్ర‌తీ సినిమానూ ఎంతో జాగ్ర‌త్త‌గా భారీ బ‌డ్జెట్ తో చాలా టైమ్ తీసుకుని తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక్కో సినిమా ఏళ్ల‌కు ఏళ్లు సెట్స్ లోనే ఉంటుంది. దీని వ‌ల్ల వ‌రుస సినిమాలు లేక ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ‌డంతో పాటూ నిర్మాత‌ల‌కు కూడా ఖ‌ర్చు ప‌రంగా భారం పెరుగుతుంది.

కానీ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ మాత్రం త‌న సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్లిన చాలా త‌క్కువ కాలంలోనే పూర్తి చేసేస్తున్నాడు. ఈ లిస్ట్ లోకి ఆయ‌న తాజాగా ర‌జినీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా కూడా చేరింది. కూలీ సినిమాను లోకేష్ కేవలం 150 నుంచి 175 రోజుల మ‌ధ్యలోనే పూర్తి చేశాడు.

ర‌జినీకాంత్ తో పాటూ నాగార్జున‌, ఉపేంద్ర‌, ఆమిర్ ఖాన్, శృతి హాస‌న్ లాంటి స్టార్ క్యాస్ట్ ను ఉంచుకుని కూడా లోకేష్ కూలీని కేవ‌లం 8 నెల‌ల్లో పూర్తి చేయ‌డమంటే మామూలు విష‌యం కాదు. ఒక్కో సినిమాను రెండు మూడేళ్లు తీస్తున్న తెలుగు డైరెక్ట‌ర్లు లోకేష్ స్పీడును చూసి నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

అయితే లోకేష్ ఇప్పుడేదో సినిమాల‌ను ఫాస్ట్ గా తీయ‌డం లేదు. అత‌ని కెరీర్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తీ సినిమానూ వీలైనంత వేగంగానే పూర్తి చేస్తూ వ‌స్తున్నాడు. మా న‌గ‌రం సినిమాను కేవ‌లం 45రోజుల్లోనే పూర్తి చేసిన లోకేష్, ఆ త‌ర్వాత కార్తీతో చేసిన ఖైదీ సినిమాను 62 రాత్రులు షూటింగ్ చేసి పూర్తి చేశాడు.

ఆ త‌ర్వాత విజ‌య్ తో చేసిన మాస్టర్ సినిమాను 129 రోజుల్లో పూర్తి చేయ‌గా, క‌మ‌ల్ హాస‌న్ తో చేసిన విక్ర‌మ్ మూవీని 110 రోజుల్లో, విజ‌య్ హీరోగా తెర‌కెక్కించిన లియోను 125 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలన్నింటిలో కూడా ఎంతో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది. అయితే స్టార్ క్యాస్ట్ ఉంద‌ని ఎప్పుడూ లోకేష్ సినిమా లేటైంది లేదు. ఇదంతా చూస్తుంటే ప్రీ ప్రొడ‌క్ష‌న్ టైమ్ లోనే లోకేష్ అన్నీ ప్లాన్ చేసుకుని దాని ప్ర‌కారమే ముందుకెళ్తాడ‌ని తెలుస్తోంది. అయితే త‌క్కువ టైమ్ లో తీశాడ‌ని ఆయ‌న సినిమాలేమైనా తేడా కొడుతున్నాయా అంటే లోకేష్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ సినిమా సూప‌ర్ హిట్ గానే నిలిచింది. లోకేష్ లోని ఈ క్వాలిటీ చూసే నిర్మాత‌లంతా ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని చూస్తున్నారు. టాలీవుడ్ లోని స్టార్ డైరెక్ట‌ర్లు లోకేష్ ను అనుస‌రించ‌క‌పోయినా క‌నీసం కొత్త డైరెక్ట‌ర్లైనా లోకేష్ రూట్ ను ఫాలో అయి ఆయ‌న‌లా త‌క్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసి స‌క్సెస్ అవాల‌ని కోరుకుందాం.

Tags:    

Similar News