క్రేజీ హీరోయిన్‌కు వాయిదా తిప్పలు
మాళవిక కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా అమ్మడికి ఆశించిన స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రాలేదు.;
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ ఇప్పటివరకు తెలుగులో డైరెక్ట్ సినిమా చేసింది లేకపోయినా అమ్మడికి టాలీవుడ్ లో మంచి క్రేజే ఉంది. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మాళవిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మాళవిక కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా అమ్మడికి ఆశించిన స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రాలేదు.
ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లంతా మంచి సక్సెస్ లు అందుకుని కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంటే మాళవిక మాత్రం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంది. దానికి కారణం అమ్మడు ఒప్పుకున్న సినిమాలన్నీ ఏదొక కారణంతో వాయిదా పడటమే. మాళవిక కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
కానీ మాళవికాకు ఏ భాషలోనూ సరైన గుర్తింపు దక్కలేదు. సరిగ్గా ఇదే టైమ్ లో అమ్మడికి టాలీవుడ్ నుంచి ఓ బంపరాఫర్ వచ్చింది. అదే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్. ది రాజా సాబ్ మూవీలో మెయిన్ హీరోయిన్ మాళవిక అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకుని తన సత్తా చాటాలనుకున్న మాళవికకు ఏదొక రూపంలో తనను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది.
వాస్తవానికి రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడా సినిమా కూడా టైమ్ కు రిలీజ్ కావడం లేదని టాలీవుడ్ లో చాలా బలమైన న్యూస్ వినిపిస్తోంది. రాజా సాబ్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస ఛాన్సులు అందుకుని దూసుకెళ్లొచ్చనుకుంటే ఆ సినిమా వాయిదాతో అమ్మడి ఆశలన్నీ నీరు కారిపోయాయి.
సరే రాజా సాబ్ ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుందిలే తమిళంలో అయినా సత్తా చాటుదామనుకుంటే కోలీవుడ్ లో కార్తీతో చేస్తున్న సర్దార్2 కు కూడా వాయిదా తప్పేలా కనిపించడం లేదు. వాస్తవానికి సర్దార్2 ఈ మే నెలలో రిలీజవాల్సింది కానీ ఇప్పుడు షూటింగ్ లో కార్తీకి కాలు గాయమవడంతో వైద్యులు అతనికి విశ్రాంతి సూచించారట. దీంతో అనుకోకుండా సర్దార్2 కు బ్రేక్ పడింది. ఈ రెండే కాదు మాళవిక చేతిలో మోహన్ లాల్ తో కలిసి చేస్తున్న హృదయపూర్వంలో సినిమా కూడా ఉంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఆగస్ట్ 25 రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంది. మరి ఈ సినిమా అయినా అనుకున్న టైమ్ కు వస్తుందా లేదా మాళవిక మరి కొంత టైమ్ ఎదురుచూడాల్సిందేనా అన్నది చూడాలి.