పుష్ప 2తో వచ్చిన లాభాలు.. వీళ్ళు పోగొట్టరు కదా?
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిందీ, తమిళ పరిశ్రమల్లో కూడా తమదైన ముద్ర వేయాలని మైత్రి పెద్ద స్కెచ్ వేసింది.;
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు తమ వ్యాపారాన్ని ఇతర భాషలకు విస్తరించేందుకు భారీ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సంస్థ గత కొంతకాలంగా వరుసగా తెలుగులో సక్సెస్ అందుకుంటూ, భారీ లాభాలు సాధించింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం పెట్టిన పెట్టుబడులు అంచనాలకు మించి ఫలితాలు అందించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి, మైత్రికి బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిందీ, తమిళ పరిశ్రమల్లో కూడా తమదైన ముద్ర వేయాలని మైత్రి పెద్ద స్కెచ్ వేసింది. కానీ ఈసారి మాత్రం రిస్క్ ఎక్కువగానే ఉందనే చెప్పాలి.
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హిందీ సినిమా జాట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది గదర్ 2 భారీ విజయం సాధించడంతో, అదే క్రేజ్‌ను క్యాష్ చేసేందుకు మైత్రి ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. కానీ సన్నీ డియోల్ సక్సెస్ ట్రాక్ ఎక్కువ కాలం నిలవకపోవడం, హిందీ మార్కెట్‌లో మాస్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండటం కొంత కలవరపెడుతున్న అంశాలు. జాట్ కు సరైన ప్రమోషన్ లేకపోతే, మైత్రికి భారీ నష్టాలు తప్పవు.
ఇదే కాకుండా మైత్రి మరో రిస్కీ ప్రాజెక్ట్‌ను చేతిలో పెట్టుకుంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా అదే ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. అజిత్ సినిమాలు ఇటీవల పెద్దగా సక్సెస్ కాకపోవడం, ముఖ్యంగా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన పరిస్థితి మైత్రిని కొంత రిస్క్‌లోకి నెట్టింది. అజిత్ సినిమాల మీద తమిళ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉంటాయి కానీ, గత రెండు సినిమాలకంటే ఈ సినిమా సురక్షితంగా ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే.
ఇప్పుడు సమస్య ఏమిటంటే, మైత్రి రెండు భారీ బడ్జెట్ సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం. రెండు ప్రాజెక్టులు భారీ స్థాయిలో విడుదల కావాలి, మంచి బజ్ క్రియేట్ కావాలి. కానీ ఒకే రోజు రిలీజ్ అవడం వల్ల ఒకదానికొకటి పోటీగా మారే ప్రమాదం ఉంది. జాట్ బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేయగా, గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ మార్కెట్‌లో హిట్ కావాలి. కానీ ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రన్ ఎలా ఉండబోతోందనే విషయంపై భారీ అనుమానాలు ఉన్నాయి.
మైత్రి గతంలో తెలుగులో వరుసగా మంచి లాభాలు అందుకున్నా, పరభాషా మార్కెట్‌లో ఇలాంటి భారీ ప్రయోగం చేయడం చాలా ప్రమాదకరమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పుష్ప 2తో వచ్చిన లాభాలతో సంస్థ ప్రాఫిట్ లోకి ఉంచింది. ఇక ఈ రెండు తేడా కొడితే మాత్రం ఆ వచ్చినవి కూడా పోయే 0ప్రమాదం ఉంది. ఏప్రిల్ 10 మైత్రి మూవీ మేకర్స్ భవిష్యత్తుకు కీలకమైన రోజు అవ్వబోతోంది. ఒకవేళ రెండు సినిమాలు హిట్ అయితే, ఇది ఈ బ్యానర్‌ను బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ లీగ్‌కి తీసుకెళ్లే అవకాశం. మరి ఈ భారీ రిస్క్ లో మైత్రి ఎంత వరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.