అందుకే ఈ సినిమా ప్రమోషన్లకు రావట్లేదు

Update: 2018-01-16 10:54 GMT
విడుదల అయిన తర్వాత సినిమాలు వివాదాలని ఎదుర్కొన్న సందర్భాలు మనం చాలానే చూసాం. కానీ విడుదలకి ముందే ఎన్నో వివాదాలని సృష్టించిన అతి కొన్ని చిత్రాలలో పద్మావతి ఒకటి. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ సినిమాలో దీపికా పదుకొనె - షాహిద్ కపూర్ మరియు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. చాలా ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్ పూర్తిచేసిన ఈ చిత్రం 'పద్మావత్' గా మారి ఈ నెల 25 వ తారీఖున విడుదలకి సిద్ధంగా ఉంది. అదే రోజున అక్షయ్ కుమార్ మరియు రాధికా ఆప్టే నటించిన 'ప్యాడ్ మాన్' కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.  

ఇకపోతే కర్ణి సేన పద్మావత్ సినిమాను రిలీజ్ చెయ్యకుండా అరికట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండటం వల్ల ముఖ్య తారాగణం అయిన దీపికా - రణ్వీర్ - షాహిద్ లు మీడియా ముందుకి రావట్లేదు. కనీసం చిత్ర యూనిట్ కూడా ఎటువంటి ప్రమోషన్స్లోనూ పాలు పంచుకోవట్లేదు. కారణం అడుగగా 'వివాదాలకు తావివ్వకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లను తగ్గించడం జరిగింది.' అంటూ సినిమా సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా తారాగణం కూడా వేరే సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆనందించకుండా ప్రమోషన్స్ లో పడి ఆఖరి నిమిషం లో వివాదంలో ఇరుక్కోవటం కంటే ఇలానే ఉండటం మంచిది అని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జనవరి 25 న రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండటం విశేషం. ఈ రెండిట్లో ఏది హిట్ అవుతుందో మనం వేచి చూడాల్సిందే..
Tags:    

Similar News