లీకు రాయుళ్లకు చెక్ పెట్టనున్న 'బిగ్ బాస్ 5'..!

Update: 2021-07-07 02:30 GMT
హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షోలలో ఒకటైన 'బిగ్ బాస్'.. తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. ఫస్ట్ సీజన్ పూణేలో.. తర్వాతి మూడు సీజన్లను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో నిర్వహించారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని 'బిగ్ బాస్-4' ను 'స్టార్ మా' వారు విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు 'బిగ్ బాస్ 5' కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో ఈసారి కూడా కాస్త లేట్ గా 'బిగ్ బాస్' బుల్లితెరపై రానున్నాడు. ఐదవ సీజన్ ను ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే 'బిగ్ బాస్ 5' ను మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిర్వహించాలని 'స్టార్ మా' ఆలోచన చేస్తోందట. దీనికి కారణం గత నాలుగు సీజన్లలో జరిగిన లీకులే అని తెలుస్తోంది.

'బిగ్ బాస్' తెలుగు షో నిర్వహకులకు మొదటి నుంచీ కూడా లీకు రాయుళ్లు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టారు. ఈ షోలో కీలకంగా ఉండే ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు బయటకు వస్తారనేది ముందే సోషల్ మీడియాలో లీక్ అవడం వారికి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. దీని వల్ల ఆదివారం వచ్చే మెగా ఎపిసోడ్ పై ఆడియన్స్ కు ఆసక్తి తగ్గిపోతుంది. ప్రోమోలతో ఎంత హడావిడి చేసినా వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే సోషల్ మీడియాలో లీక్ అవుతుండంతో ఇంట్రస్ట్ పోతుంది. అందుకే 'బిగ్ బాస్ 5' లో ఈ విషయంపై మరింత జాగ్రత్తగా ఉండటానికి నిర్వాహకులు ప్లాన్స్ వేస్తున్నారట.

అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే 'బిగ్ బాస్ 5' షో కోసం సరికొత్త ప్లాన్ రెడీ చేసారట. షోకు సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాకుండా చూసుకోడానికి స్పెషల్ గా ఓ టెక్నికల్ టీమ్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఎలిమినేట్ అయ్యే వ్యక్తి గురించి బయటకు పొక్కకుండా ఆ టీమ్ కేర్ తీసుకోనున్నారట. లీకు రాయుళ్లు వాటిని దాటుకుని మరీ సీక్రెట్స్ ని రివీల్ చేస్తారేమో చూడాలి. ఇకపోతే 'బిగ్ బాస్ 5' కు అక్కినేని నాగార్జున లేదా రానా దగ్గుబాటి హోస్టుగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News