థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

Update: 2022-02-09 03:32 GMT
ఇప్పుడు ఒక సినిమా థియేటర్లలో వారం రోజులు ఆడటం గగనమైపోయింది. అదే రెండు వారాలు నడిస్తే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే 10 రోజులకు కూడా మేకర్స్ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. 25 - 50 రోజులు ప్రదర్శితమైతే గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు రెండు వారాలు తిరగక ముందే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయంటేనే ఈరోజుల్లో థియేట్రికల్ రన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే అప్పట్లో 100 రోజుల నుంచి 365 రోజులకు పైగా ఆడిన చిత్రాలు కూడా ఉన్నాయి. 1000 రోజులు నడిచిన సినిమాలు కూడా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. అలా తెలుగులో ఒక యేడాదికి పైగా ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శించబడిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం!

* లవకుశ: 1963లో నందమూరి తారకరామారావు హీరోగా సి. పుల్లారావు - సీఎస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తెలుగులో తొలి కలర్ సినిమాగా చరిత్రలో నిలిచింది. 469 రోజుల పాటు థియేటర్లో ఆడిన ఈ సినిమా.. అప్పట్లో కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.

* అడవి రాముడు: 1977లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి తారకరామారావు హీరోగా.. జయసుధ - జయప్రద హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఇది. అప్పట్లో ఏడాదికి పైగా థియేటర్లలో ఆడిన ఈ సినిమా ఎన్టీఆర్ సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించింది. 365 రోజులకు గాను దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టింది.

* మరపురాని చిత్రం: కమల్ హాసన్ - జయప్రద - రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో లెజెండరీ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన అద్భుతమైన సినిమా ఇది. 1978లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. 556 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది.


* వేటగాడు: నందమూరి తారకరామారావు - శ్రీదేవి జంటగా.. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. 1979లో విడుదలైన ఈ సినిమా 409 రోజుల పాటు థియేటర్లలో నడిచింది.

* ప్రేమాభిషేకం: అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. శ్రీదేవి - జయసుధ హీరోయిన్లుగా నటించారు. విషాదాంత క్లైమాక్స్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. 1981 లో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో 533 రోజుల పాటు ఆడింది.

* ప్రేమసాగరం: 1983లో తెలుగులో విడుదలై సంచలనం సృష్టించిన తమిళ డబ్బింగ్ సినిమా ఇది. తమిళ హీరో శింబు తండ్రి టి.రాజేందర్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం.. ఇక్కడ థియేటర్లలో 465 రోజుల పాటు ప్రదర్శించబడటం విశేషం.

* మంగమ్మగారి మనవడు: నందమూరి బాలకృష్ణ - సుహాసిని హీరోహీరోయిన్లుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. 1984లో విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీ థియేటర్లలో ఏకంగా 567 రోజులు ఆడింది.

* పోకిరి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా థియేటర్లలో 580 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడినట్లు మేకర్స్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అలానే 1000 రోజులు సినిమా హాళ్లలో ఆడినట్లు పోస్టర్ కూడా ఉంది.
 
* మగధీర: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ ఇది. 2009లో విడుదలైన ఈ సినిమా 75 కోట్ల షేర్ తో అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా ఒక థియేటర్లో 1000 రోజులకు పైగా ఆడినట్లు.. సౌత్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినట్లు మేకర్స్ పోస్టర్ కూడా వదిలారు.

* లెజెండ్: 'సింహా' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నటసింహం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. 2014లో విడుదలైన ఈ చిత్రం 2017 వరకు థియేటర్లో ఆడింది. రాయలసీమ పొద్దుటూరులోని అర్చన థియేటర్లో 1005 రోజులు ప్రదర్శించబడినట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేయబడింది. ఇది దక్షిణ భారతదేశంలోనే నాలుగు అంకెల రోజులు నడిచిన సినిమాగా మేకర్స్ పేర్కొన్నారు.
Tags:    

Similar News