ఒకప్పుడు నెత్తిన పెట్టుకున్నవారే.. ఇప్పుదెందుకు విస్మరిస్తున్నారు..?

Update: 2022-05-04 01:30 GMT
గత కొంతకాలంగా సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో భారీ వసూళ్లలో బాలీవుడ్ పై ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. డబ్బింగ్ వెర్షన్స్ తో హిందీ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అదే సమయంలో వచ్చిన హిందీ చిత్రాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి.

ఓవైపు దక్షిణాది చిత్రాలు దుమ్మురేపుతూ వస్తుంటే.. మరోవైపు హిందీ సినిమాలు మాత్రం తొలి వీకెండ్ లోనే తోక ముడుస్తున్నాయి. అంతకు ముందు 'పుష్ప 1'.. ఆ తర్వాత RRR.. ఇప్పుడు 'కేజీఎఫ్ 2'.. ఇలా వరసపెట్టి గత ఐదు నెలలుగా బాలీవుడ్ కు కంటి మీద కునుకు లేకుండా చేసేశాయి.

సౌత్ సినిమాల హవా మధ్య రిలీజ్ చేసిన '83' 'గంగూబాయి' 'ఎటాక్' 'బచ్చన్ పాండే'.. వంటి హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నార్త్ సర్క్యూట్ లో 'కేజీయఫ్ 2' డామినేషన్ నడుస్తున్న టైమ్ లో.. ధైర్యం చేసి థియేటర్లలోకి తీసుకొచ్చిన మూడు హిందీ సినిమాలు కూడా కనీస ప్రేక్షకాదరణ తెచ్చుకోలేకపోయాయి.

షాహీద్ కపూర్ 'జెర్సీ' మరియు అజయ్ దేవగన్ 'రన్ వే 34' సినిమాలతో పాటుగా టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిని హిందీ ప్రేక్షకులు తిరస్కరించడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి.

RRR - KGF 2 లాంటి భారీ విజయాలను పక్కన పెడితే.. ఇటీవల విడుదలై పరాజయం మూటగట్టుకున్న 'రాధేశ్యామ్' సినిమా ఫస్ట్ డే వసూళ్ల కంటే ఈ మూడు హిందీ సినిమాల కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందీ ఆడియన్స్ కు ఏమైంది? ఒకప్పుడు బాలీవుడ్ ను నెత్తిన పెట్టుకున్న ప్రేక్షకులు.. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోల సినిమాలను సైతం ఎందుకు విస్మరిస్తున్నారు? అసలు వారి నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? అనే చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ లో సత్తా చాటుతున్న సౌత్ సినిమాలన్నీ మాస్ మసాలా కంటెంట్ తో రూపొందిన యాక్షన్ చిత్రాలే. అయితే హిందీలో ఇలాంటి సినిమాలు రాక చాలా కాలం అవుతోంది. దీన్ని సౌత్ ఫిలిం మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. హిందీ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆ పల్స్ పట్టుకొని సక్సెస్ అవుతున్నారు.

అయితే బాలీవుడ్ ఫిలిం మేకర్స్ మాత్రం ఈ విషయంలో విఫలం అమవుతున్నారు. హిందీ సినీ ప్రియులను జడ్జ్ చేయలేకపోతున్నారు. కథలకు చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, వాటిని సౌత్‌ సినిమాల లాగా భావించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

కాకపోతే ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.. హిందీ ప్రేక్షకులకు థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా బాలీవుడ్ మేకర్స్ సౌత్ సినిమాల సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ.. మంచి కంటెంట్ తో వస్తే నార్త్ జనాల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో అలాంటి చిత్రాలు వస్తాయేమో చూడాలి.
Tags:    

Similar News