పేదలకు సినీ వినోదం అందించడం అంటే ఇదేనా..?

Update: 2022-03-24 17:30 GMT
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 'బాహుబలి' తర్వాత దర్శకధీరుడి నుంచి రాబోయే సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు జత చేరడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

RRR రిలీజ్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లల వద్ద సందడి మొదలైంది. బ్యానర్లు ప్లెక్సీలు కటౌట్లతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మరోవైపు సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో మరికొందరు ఉన్నారు.

పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు బ్లాక్ టికెట్ల దందా నడవడం మామూలుగా జరిగేదే. థియేట‌ర్ల వాళ్లే కొన్ని టికెట్లు బ్లాక్ చేసి.. వాటిని సిబ్బందితో అధిక ధరలకు అమ్మిస్తుంటారు. కౌంటర్లలోనే ఇలాంటివి జరిగిన సందర్భాలున్నాయి. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లో ఇవి ఎక్కువగా చూస్తుంటాం.

ఇటీవల ఏపీలో టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో 'పుష్ప' 'భీమ్లా నాయక్' వంటి సినిమాలకు ఆన్ లైన్ బుకింగ్స్ తగ్గించి.. టికెట్ కౌంటర్స్ లోనే ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువకు అమ్మారనే టాక్ ఉంది. ఈ వ్యవహారంలో ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ కొందరు అధికార పార్టీ నాయకులతో కలిశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు RRR సినిమా టికెట్స్ కు డిమాండ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి. అయితే ఏపీలోని చాలా థియేట‌ర్లలో ఆన్ లైన్‌ లో టికెట్స్ అందుబాటులోకి రాలేదు. ఆన్లైన్ లో ఉన్న థియేటర్లలో కూడా తక్కువ టిక్కెట్స్ మాత్రమే పెట్టారు.

మిగిలిన టికెట్లను కౌంటర్ బుకింగ్స్ లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు - పోలీసులు సైతం ఈ వ్యవహారంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారట. దీని గురించి పట్టించుకునేవాళ్ళు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా బ్లాక్ టికెట్ దందా సాగుతోంది.

సామాన్యులకు సినీ వినోదం భారం కాకూడదని టికెట్ రేట్లు నియంత్రిస్తున్నట్లు ఏపీ సర్కారు గతేడాది జీవో జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని సినిమాలకు అనధికారికంగా ఎక్కువ రేట్లకే టికెట్లు అమ్మారు. అప్పుడు పెద్దగా పట్టించుకోని అధికారులు.. 'భీమ్లా నాయక్' రిలీజ్ సమయంలో మాత్రం కొరడా జులుపించారు.

ఈ క్రమంలో సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అటు నిర్మాతలకు ఇటు ప్రజలకు భారం కాకుండా ఈ ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు RRR టికెట్ రేట్లు చూస్తే సామాన్యుల జేబులకు చిల్లులు పడటం  గ్యారంటీ.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ జగన్ సర్కారు టికెట్ ధరలు పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చింది. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రేట్లు పెంచారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు బ్లాక్ లో ఇష్టమొచ్చినట్లు అమ్మడానికి రెడీ అవుతున్నారు. రేపు షోలు వేసే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

RRR టికెట్ ధరలు చూస్తుంటే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే అవకాశం లేదనే అభిప్రాయాలు అవుతున్నాయి. జగన్ సర్కారు పేదలకు ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్లు నిర్ణయించామని చెప్తుంటే.. రియాలిటీ మాత్రం అలా జరగడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News