వరుణ్ తేజ్ సినిమాకి టైటిల్ కష్టాలు...?

Update: 2020-06-26 08:10 GMT
మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వ‌రుణ్ తేజ్ ఫస్ట్ సినిమా 'ముకుంద'తోనే తనలో మంచి నటుడు దాగున్నాడని నిరూపించాడు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కంచె' 'ఫిదా' 'తొలిప్రేమ' 'ఎఫ్ 2' చిత్రాలలో తనదైన మార్క్ నటనతో మంచి విజయాలను అందుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మీడియం రేంజ్ హీరోల్లో వ‌రుణ్ తేజ్ కే ఎక్కువ హిట్లు ఉన్నాయని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ కమర్షియల్ చిత్రాల వెనుక ప‌రుగెత్త‌కుండా కంటెంట్ ఉన్న క‌థ‌ల్నే ట్రై చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కఠోర వ్యాయామాలు చేసి మంచి ప్రొఫెషనల్ బాక్సర్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన వరుణ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటి నుంచి వరుణ్ తేజ్ కెరీర్లో వస్తున్న 10వ సినిమా పై ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం టైటిల్ కూడా ఇప్పుడప్పుడే రివీల్ చేసే ఆలోచన చేయడం లేదట. దీనికి కారణం పూరీ జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ అడ్డు తగలడమే అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ సినిమాకి 'లోఫర్' డైరెక్టర్ అడ్డుపడటం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే.

వరుణ్ తేజ్ సినిమాకి 'ఫైటర్' లేదా 'బాక్సర్' అనే టైటిల్స్ అనుకున్నారట. అయితే ఈ రెండు టైటిల్స్ పూరీ అండ్ టీమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. ఇందులో ఏదొక టైటిల్ వారు తీసుకున్నాక మిగిలినది వరుణ్ తీసుకోవాల్సి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ఇటీవల ప్రకటించారు. దీంతో వరుణ్ తేజ్ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ఒక ఛాయస్ అని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ ఫైనలైజ్ చేయబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇటీవలే ఈ సినిమా కోసం మళ్ళీ కసరత్తులు స్టార్ట్ చేసారు వరుణ్. ఈ సినిమాలో శాండిల్ వుడ్ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
Tags:    

Similar News