వేణుమాధవ్‌ మృతిపై చిరు - మహేష్ స్పందన

Update: 2019-09-25 16:02 GMT
తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోదా హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన వేణు మాధవ్‌ కు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌ లో కమెడియన్‌ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. దాదాపు 400 సినిమాల్లో ముఖ్య కమెడియన్‌ పాత్రను పోషించిన వేణు మాధవ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరి సినిమాల్లో కూడా నటించాడు. నేడు ఆయన మృతి పట్ల చిరంజీవి.. మహేష్‌ బాబు.. నాని.. రాజశేఖర్‌.. నరేష్‌ ఇంకా పలువురు వేణు మాధవ్‌ మృతిపై ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు.

మహేష్‌ బాబు స్పందిస్తూ.. వేణు మాధవ్‌ గారి మృతి తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు మరియు సన్నిహితులకు నా సంతాపం తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

చిరంజీవి స్పందిస్తూ.. మాస్టర్‌ చిత్రం సమయంలో వేణు మాధవ్‌ నాతో మొదటి సారి నటించాడు. హాస్యనటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. వేణు ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

రాజశేఖర్‌ మాట్లాడుతూ.. మా కుటుంబంకు వేణు మాధవ్‌ తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. నన్ను బావ అని జీవితను అక్క అంటూ పిలిచేవాడు. ప్రతి పండగకు తప్పకుండా కలిసి శుభాకాంక్షలు చెప్పేవాడు. మేమిద్దరం చాలా సినిమాల్లో నటించాం. వేణును మొన్ననే హాస్పిటల్‌ లో కలిసిన సమయంలో చాలా ఆరోగ్యంగా కనిపించాడు. తప్పకుండా మళ్లీ రికవరీ అవుతాడని అనుకున్నాను. కాని ఇంతలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నంత కాలం నవ్వించాడు.. చనిపోయి ఏడిపిస్తున్నాడు అంటూ రాజశేఖర్‌ ఎమోషనల్‌ అయ్యారు.

నరేష్‌ మాట్లాడుతూ.. వేణు మాధవ్‌ మంచి కమెడియన్‌. చాలా సార్లు మా మెంబర్‌ గా కూడా వేణు చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్నారు.

నాని స్పందిస్తూ.. రాధాగోపాలం చిత్రం షూటింగ్‌ సమయంలో నేను క్లాప్‌ బోర్డ్‌ పట్టుకుని ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అది నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది. అంతటి కామెడీని ఆయన పండిస్తాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతిని కలిగించాలి దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

Tags:    

Similar News