ఈ రూ.50 కోట్లు.. రూ.60 కోట్ల గోలేంది?

Update: 2015-10-28 01:30 GMT
ఈ మధ్యన యువ హీరోలు మొదలుకొని అగ్రశ్రేణి కథానాయకులు నటించిన చిత్రాల బడ్జెట్ మాట ఎత్తితే రూ.50కోట్లు అన్నది సర్వసాధారణంగా మారింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన రాంచరణ్ చిత్రం బ్రూస్ లీ సినిమాకు దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని.. రూ.60కోట్ల కలెక్షన్లు వస్తే కానీ నిర్మాత బయటపడరన్న మాట స్పష్టంగా వినిపించింది. తాజాగా నాగార్జున తనయుడు అఖిల్ నటించిన చిత్రం ‘‘అఖిల్’’నే చూస్తే.. ఈ సినిమాకు దాదాపు రూ.50కోట్లకు పైనే ఖర్చు చేశారని చెబుతున్నరు.

మరి.. అంత భారీగా ఏం ఖర్చు చేశారన్నది సినిమా విడుదల అయ్యాక థియేటర్లలో చూస్తే అవాక్కు  కావాల్సిందే. బ్రూస్ లీ సినిమానే తీసుకుంటే. ఖర్చుల కోసం రూ.50కోట్ల వరకు ఎలా ఖర్చుచేశారా? అన్నది సినిమా చూసిన వారికి ఎంతకూ మింగుడు పడదు. అంత ఖర్చు ఎందుకైందంటే.. రెమ్యూనరేషన్లు ఇవ్వాలి కదా అన్న మాటలు వినిపిస్తాయి. ఇదిలా ఉంటే.. ఏడాదికి ఒక సినిమా చేసి.. దాని కోసం భారీగా పారితోషికం తీసుకునే కన్నా.. ఏడాదికి రెండు.. మూడు సినిమాల్లో నటించటం.. భిన్నమైన పాత్రల్ని ఎంపిక చేసుకోవటం.. ఖర్చును అదుపులో ఉంచితే ఎంత సుఖం. కానీ.. ఇలాంటి వాటికి ఎంతమంది అగ్రశ్రేణి కథానాయకులు సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద ప్రశ్న. ఏడాదికో.. ఏడాదిన్నరకో ఒక సినిమా చేయటం.. దాని కోసం విపరీతమైన హైప్ క్రియేట్ కావటం.. ఆ అంచనాలు రీచ్ అయ్యేందుకు భారీగా ఖర్చు చేయటం లాంటివి ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి.

భారీగా ఖర్చు చేసిన తర్వాత.. దాని గురించి చింతించటం.. కలెక్షన్ల కోసం ఊపిరి బిగబెట్టి ఎదురుచూస్తే.. టెన్షన్ టెన్షన్ గా గడపటం లాంటి వాటి కంటే కూల్ బడ్జెట్ తో ఎందుకు సినిమాలు తెరకెక్కించటం లేదన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనికి అగ్రశ్రేణి కథానాయకుల తీరు కూడా కారణంగా చెప్పాలి. తాము నటించే ప్రతి సినిమా అదిరిపోవాలని.. కాసుల వర్షం కురిపించాలని తపించటమే.. అందుకోసం భారీగా ఖర్చు పెట్టించే విధానం ఒకటి టాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని ఫలితమే సినిమా చివర్లో లెక్కలు తేలి.. ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చినా కూడా ప్లాప్ టాక్ పడిపోయే పరిస్థితి.

ఇక.. సినిమాకు రూ.50కోట్లు.. రూ.60 కోట్లు ఖర్చు అయ్యిందన్న మాట వెనుక లెక్క వేరే ఉందని చెబుతున్నారు. సినిమాకు ఒక విలక్షణమైన ఇమేజ్ తీసుకురావటం.. హైప్ క్రియేట్ చేయటం.. విపరీతమైన ఆసక్తిని పెంచేలా చేయటం ద్వారా భారీ ఓపెనింగ్స్ మీద నిర్మాతలు ఫోకస్ చేస్తున్నారు. దీని ఫలితమే.. ‘‘మా సినిమాకు రూ.50కోట్లు ఖర్చు అయ్యింది. రూ.60కోట్లు ఖర్చు అయ్యింది’’ అన్న మాటలు. క్రిష్ దర్శకత్వంలో విడుదలై విజయవంతంగా నడుస్తున్న ‘‘కంచె’’ సినిమా గురించే చూస్తే.. ఈ సినిమాలో నిర్మాణ విలువలు.. లొకేషన్లు అన్నీ రిచ్ గా ఉంటాయి. ఖర్చు మాత్రం పెద్దగా కాలేదని చెబుతున్నారు. అలా అని ఖర్చు ఏమీ కాలేదని కాదు. మామూలు సినిమాలకు అయినట్లుగా రూ.50 కోట్లు.. రూ.60కోట్లు ఏమీ సినిమాకు కాలేదు. ఆ మాటకు వస్తే రూ.50కోట్లలో 20 నుంచి 25 శాతం ఖర్చుకే కంచె లాంటి సినిమా వచ్చేసిన పరిస్థితి.

రిచ్ గా తీసేందుకు.. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకున్నా అంత తక్కువ మొత్తానికి అంత రిచ్ మూవీ వస్తే.. మిగిలిన వారికి రూ.50కోట్లు.. రూ.60కోట్లు ఖర్చు కావటం ఏమిటి..? ఇలాంటి విషయాల మీద చిత్ర పరిశ్రమ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా. ప్రచారం కోసం పెద్ద పెద్ద మొత్తాలతో సినిమా విలువను పెంచేస్తే ఓకే కానీ.. సరైన కథ.. కథనం లేకుండానే వృధా ఖర్చు పెడితే.. ఈ మధ్య విడుదలైన అగ్రహీరోల చిత్రాలకు ఎదురైన చేదు ఫలితాలే వస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. 
Tags:    

Similar News