#టాలీవుడ్ .. ఇంత వేగంగా కోలుకుంటుంద‌ని ఊహించ‌నేలేదు!

Update: 2021-02-22 11:54 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ క్రైసిస్ దెబ్బ‌కు అన్నిప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు టాలీవుడ్ విల‌విల‌లాడిన సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిది నెల‌ల పాటు సినిమాల చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. అర‌కొర షూటింగులు మిన‌హా సెట్స్ కెళ్లే ప‌రిస్థితే లేదు. అలాగే సినిమాల రిలీజ్ లు ఎక్కడివ‌క్క‌డే ఆగిపోయాయి. ఈ స‌న్నివేశంలో ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న‌వాటి ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాలేదు.

నిజానికి క్రైసిస్ ప్ర‌భావం సుదీర్ఘ కాలం ప‌రిశ్ర‌మ‌పై ఉంటుంద‌ని బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా ఎగ్జిబిష‌న్ రంగం తీవ్ర న‌ష్టాల్లోకి వెళ్లిపోయింది. జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోతే ఇక సినిమాలు తీసేవాళ్లుంటారా? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మైంది. అలాగే ప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల కార్మికుల ఉపాధి జీరో అయిపోయి రోడ్డెక్కాల్సిన స‌న్నివేశం ఎదురైంది. క‌నీస ఉపాధి కూడా క‌రువైంది.

ప‌రిస్థితి ఇలానే మ‌రో ఏడాది కొన‌సాగితే ఇక ప‌రిశ్ర‌మ అంతా జీరో అయిపోయాదే. కానీ అంతా అనూహ్యం. ఊహించ‌ని రీతిలో తిరిగి తెలుగు చిత్ర‌సీమ కోలుకుంటోంది. ఊపాధి పెరిగింది. వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తూ టాలీవుడ్ కంబ్యాక్ అయిన తీరు చ‌రిత్ర సృష్టిస్తోంది. సంక్రాంతి బ‌రిలో క్రాక్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఆ వెంట‌నే ఉప్పెన రికార్డులు బ‌ద్ధ‌లు కొడుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. మొన్న రిలీజైన జాంబిరెడ్డి- నాంది వంటి చిత్రాలు చ‌క్క‌ని వ‌సూళ్ళ‌ను సాధించాయి. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాయి. దీంతో ప‌రిశ్ర‌మ‌లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది.

ఇక క్రైసిస్ కాలంలో ప‌రిశ్ర‌మ‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. ఇలానే ఉంటే బ‌డ్జెట్లు కుదించుకుపోతాయ‌ని.. హీరోలు టాప్ టెక్నీషియ‌ర్లు పారితోషికాలు త‌గ్గించుకుంటార‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. కానీ అవేవీ నిజాలు కాలేదు. య‌థావిధిగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాల‌తో పాటు మీడియం బ‌డ్జెట్.. చిన్న బ‌డ్జెట్ చిత్రాలు షూటింగులు జ‌రుపుకుంటున్నాయి.

దీంతో ప‌రిశ్ర‌మ మునుప‌టిలా క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ మార్పు అంతా కేవ‌లం రెండు నెల‌ల్లోనే సాధ్య‌మైంది. మునుముందు క‌రోనా పూర్తిగా జీరో అయిపోతే ఆ మేర‌కు అంతా క‌లిసొచ్చే కాల‌మే అని ఊహిస్తున్నారు. ప్ర‌స్తుతం విదేశీ మార్కెట్ కూడా నెమ్మ‌దిగా కోలుకుంటుంటే టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. మునుముందు ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో డ‌జ‌ను వ‌ర‌కూ క్రేజీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. చిన్న సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. వీట‌న్నిటి బిజినెస్ వేగంగా పూర్త‌వుతోంది. ఇదంతా చూస్తుంటే ప‌రిశ్ర‌మ‌కు మున్నుందు మ‌రిన్ని మంచి రోజులున్నాయ‌నే అర్థ‌మ‌వుతోంది. నిర్మాత‌లు- పంపిణీదారులు- ఎగ్జిబిట‌ర్లు- కార్మికుల‌కు అంద‌రికీ ఇది శుభ‌వార్తే.
Tags:    

Similar News