టాలీవుడ్ టు హాలీవుడ్ చుట్ట‌బెట్టేసింది!

Update: 2020-02-22 05:12 GMT
క‌రోనా మ‌హ‌మ్మారికి చైనా అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. అక్క‌డ మ‌ర‌ణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.  వైర‌స్ దాటికి ప్ర‌పంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్ప‌టికే చైనాకు రాక పోక‌లు నిలిచిపోయాయి. చైనీయులు దేశం దాట‌డానికి లేదు. ఇత‌ర దేశ‌స్తులు చైనాలో కాలు పెట్ట‌డానికి వీల్లేదు. క‌రోనా పూర్తిగా అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కూ అక్క‌డ ఇదే ప‌రిస్థితి. అయితే ఇప్పుడీ ప్ర‌భావం సినిమా రంగంపై గ‌ట్టిగా ప‌డింది. టాలీవుడ్..బాలీవుడ్...హాలీవుడ్ సినిమాల షూటింగ్ ల‌కు తాత్క‌లికంగా బ్రేక్ ప‌డింది. ఫ‌లితంగా ఆ సినిమా లేవి అనుకున్న తేదీల్లో రిలీజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అలాగే మ‌న సినిమాలేవీ చైనాలో రిలీజ్ అయ్యే స‌న్నివేశం కూడా లేకుండా పోయింది.

టాలీవుడ్ పైనా క‌రోనా ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే నాగార్జున న‌టిస్తున్న `వైల్డ్ డాగ్`  షూటింగ్ నిలిచిపోయింది. కొన్ని స‌న్నివేశాల్ని థాయ్ లాండ్ లో షూట్ చేయాల్సి ఉండ‌గా క‌రోనా భ‌యంతో వాయిదా వేసుకున్నారు. అలాగే రామ్ గోపాల్ వ‌ర్మ `ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్` కీల‌క షెడ్యూల్ ని చైనాలో చిత్రీక‌రించాల్సి ఉంది. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూడు నెల‌ల తర్వాత ఆ షెడ్యూల్ గురించి ఆలోచించాల‌ని వాయిదా వేసారు. ఇంకా ప‌లు టాలీవుడ్ షూటింగ్ లు క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డ్డాయి. చైనా లో అనుకున్న షెడ్యూళ్ల‌ను దుబాయ్ కి షిఫ్ట్ చేశారు. హీట్ ఎక్కువ ఉండే దేశాల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న చోట వైర‌స్ ఉండ‌దు కాబ‌ట్టి.. సినిమా వాళ్లు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక  హాలీవుడ్ సినిమాల‌కు చైనా మార్కెట్ అత్యంత కీల‌క‌మైన‌ది. కేవ‌లం చైనా నుంచి వంద‌ల కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడుతుంటాయి. గ‌త ఏడాది అవెంజ‌ర్స్ .. కెప్టెన్ అమెరికా స‌హా ప‌లు భారీ చిత్రాలు వంద‌ల కోట్లు వ‌సూలు చేశాయి. అయితే ప్ర‌స్తుత స‌న్నివేశం అన్నిటికీ చెక్ పెట్టేసింది. చైనా క‌లెక్ష‌న్స్ కోసం హాలీవుడ్ స్టార్లు నేరుగా బ‌రిలో దిగి ఆ దేశంలో పెద్ద ఎత్తున త‌మ‌ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి  బ‌రిలోకి దిగుతారు. చైనా మొత్తాన్ని చుట్టేస్తూ ప్ర‌చారం చేస్తారు. కానీ ఇప్పుడు క‌రోనా భ‌యంతో చైనాకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం జేమ్స్ బాండ్ `నో టైమ్ టు డై` సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అన్ని ప‌నులు పూర్తిచేసి ఏప్రిల్ 8 న‌ అన్ని దేశాల్లో విడుద‌ల కానుంది.

దీనిలో భాగంగా బాండ్ అండ్ టీమ్ చైనా రాజ‌ధాని బీజీంగ్ వెళ్లి ప్ర‌మోట్ చేయాల్సి ఉంది. కానీ క‌రోనా దాడి కార‌ణంగా ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు స‌రైన ప్ర‌చారం లేక కిల్ అవుతోంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అటు `పాస్ట్ అండ్ ప్యూరియ‌ర్స్ -9`- `వండ‌ర్ ఉమెన్ 1984` లాంటి చిత్రాలు జోరుగా ప్ర‌చారం చేసుకుంటున్నా కానీ బాండ్ ప‌రిస్థితి తీసిక‌ట్టుగా ఉంది. క‌రోనా ప్ర‌భావంతో చైనాలో జ‌నం థియేట‌ర్ల‌కు వెల్ల‌లేని ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి ఇక ఆ మార్కెట్ ని హాలీవుడ్ కోల్పోయిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇటు భార‌తీయ సినిమాల‌పైనా ఆ ప్ర‌భావం ఉండ‌నే ఉంటుంది.
Tags:    

Similar News