టాలీవుడ్ వెటరన్స్.. మారాల్సిందేనా?

Update: 2019-12-21 04:25 GMT

బాలయ్య బాబు రూలర్ సినిమా చూశాక ప్రేక్షకులు యూట్యూబ్ చానెల్స్ వద్ద చేసిన కామెంట్లు మన చెవులతో వినేలా లేవు. ఇక కోటి రూపాయలు పెట్టి వెంకటేశ్ సినిమా కోసం రాసిన ‘వెంకీమామ’ కథ కూడా ఊరు గొప్ప.. పేరు దిబ్బ అన్నట్టుగానే ఉందని విమర్శలు వచ్చాయి. మన టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మొన్నీ మధ్య తీసిన సినిమా అయితే అసలు సోదీలోనే లేకుండా పోయింది.. చిరంజీవి కూడా టాలీవుడ్ లో ఇక్కడి ఫ్యాన్స్ అండతో తొడకొట్టినా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ దేశమంతా ‘సైరా’ అనిపించుకోలేకపోయింది. మరి మన వెటరన్స్ కు ఏమైంది? ఎందుకీ పాత చింతకాయపచ్చడి కథలనే మళ్లీ వండి వార్చి ప్రేక్షకులకు పెడుతున్నారు. కాలం మారింది.. కొత్తదనం పుట్టుకొస్తోంది. ఎన్నో అద్భుతమైన కథాంశాలతో ప్రయోగాలు చేయాల్సిన మన అగ్రహీరోలు ఇంకా ఎందుకు ఆ మూసధోరణిని విడలేకపోతున్నారన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న అంతుచిక్కని ప్రశ్న.

‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సృష్టిస్తాను’ అన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాల గోల వదిలేసి  హాయిగా సుబ్రరంగా పాలిటిక్స్ లో రోజుకో ట్వీట్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఆయనకీ బాధతప్పింది. కథలు లేవంటూ అగ్రహీరో వెంకటేశ్ ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా తీస్తున్నాడు.. ఎఫ్2 తర్వాత వెంకీ తీసిన ‘వెంకీమామ’ కథ చూస్తే మూసతో అన్ని కలిపికొట్టేశారని విమర్శలొచ్చాయి.  ఇక బాలయ్య రూలర్ మూవీలో ఆయన రాయలసీమ ఫ్యాక్షన్ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, పాత సినిమాల వాసన కనిపించి బ్యాక్ డ్రాప్ కథలనే కొంచెం నేటివిటీ మార్చేసి వాడేశారని ఫ్యాన్స్ ఆడిపోసుకుంటున్నారు.  మన నాగార్జున మన్మథుడు2 మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. చిరంజీవి కొత్తగా ‘సైరా’ ప్రయోగం చేసి కాస్తో కూస్తో అలరించినా అది ఫ్యాన్స్ కు కిక్కివ్వలేదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

మరి మన వెటరన్స్ కు ఏమైందిలా..  ప్రయోగాలు ఎందుకు చేయడం లేదన్నదే అందరి ప్రశ్న. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొత్త కథలతో వాస్తవికతో సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరి మన తెలుగు హీరోలు ఎందుకు ఇలా ట్రై చేయడం లేదన్నదే ప్రశ్న. ఎంతసేపు 6 పాటలు, మూడు ఫైట్లు, ఒక తొడగొట్టడాలేనా సినిమా.. కొత్తగా చేయాలన్న తాపత్రయం లేదా అని క్రిటిక్స్, అభిమానులు వాపోతున్నారు.

ఇలా ప్రశ్నించేవాల్లకు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సమాధానం కథలు లేవని.. కానీ కథలు ఉన్నాయి. వాటి వద్దకు మన అగ్రహీరోలు వెళ్లడం లేదు. పట్టించుకోవడం లేదు. ఎంతసేపు పేరు మోసిన కథకులు, రచయితల వద్దకే పరుగులు తీస్తున్నారు. కొత్త కథలతో వస్తున్న కుర్రకారును, నవతరం రచయితలను ప్రోత్సహించడం లేదు.

కొత్త రచయితలు, కుర్రాళ్లకు కూడా ఈ అగ్రహీరోలను కలిసి కథలు చెప్పేంత స్కోప్ దొరకడం లేదు. దీంతో వారంతా ఘోస్ట్  రైటర్లుగా పెద్ద రచయితల వద్ద తమ క్రియేటివిటీని చంపుకుంటున్న పరిస్థితి ఉంది.

కొత్త కథలు కొత్తదనంలోంచే వస్తాయి. కొత్తగా ఆలోచించి కథలు రాసే వారు ఎందరో ఉన్నారు. కానీ మన అగ్రహీరోల లాబీని దాటి వాళ్లంతా ముందుకు రాని పరిస్థితి. ఆ హీరోలందరూ తమ కట్టుబాట్లను విప్పేసి కొత్తదనం కోసం వెళితే అద్భుతమైన కథలు సొంతమవుతాయి. ఎంతసేపు మూసధోరణితో కథలు రాసే వారిని పక్కనపెట్టి కొత్త కథలను ప్రోత్సహిస్తే కానీ మన అగ్రహీరోల సినిమాలు ఆడేలా లేవు.

ఇప్పటికే వెంకటేశ్ రిమేక్ సినిమాలతో కాలం గడిపేస్తున్నాడు. బాలయ్య అదే ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు అంటున్నాడు.  నాగార్జున వయసుకు తగ్గ కథే దొరకని పరిస్థితి. ఒక్క చిరంజీవి మాత్రం ఇప్పుడు ‘కొరటాల శివ’లాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేస్తున్నారు. ఇలా వెటరన్స్ మారనంత వరకూ టాలీవుడ్ లో వారి మనుగడ కష్టమే.. కొత్తగా ప్రయత్నించనంత కాలం సినిమాలు ఆడేలా కనిపించడం లేదని ఫ్యాన్స్, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News