ఇంకా నీచేతిలోనే నా చెయ్యి ఉంది నాన్నా

Update: 2015-03-20 10:28 GMT
అతిగారాబం, ప్రేమ కురిపించే నాన్న కనిపిస్తే వెంటనే బొమ్మరిల్లు నాన్న అని పిలిచేస్తాం. పిల్లలపై ప్రేమ ఉండొచ్చు కానీ, అతి ప్రేమతో ఆశలు చంపేయకూడదు అన్న సందేశాన్ని చక్కగా చూపించాడు బొమ్మరిల్లు భాస్కర్‌. అయితే సరిగ్గా ఇదే తరహా నాన్నలు టాలీవుడ్‌లో ఎవరున్నారు? అని పరిశీలిస్తే బొమ్మరిల్లు నాన్నల చిట్టా బైటికి వచ్చేసింది.

చరణ్‌:

ఈ యువహీరో స్టార్‌ హీరోగా ఎదిగేసినంత మాత్రాన ఆ చెయ్యి తండ్రి చేతి నుంచి ఇంకా విడిపించుకున్నట్టు కాదు. ఇంకా అతడి చెయ్యి తండ్రి చిరంజీవి చేతుల్లోనే ఉంది. చరణ్‌ ఏదైనా స్క్రిప్టు ఓకే చెయ్యాలంటే తను విన్న తర్వాత నాన్న చిరంజీవి వినాల్సిందే. స్క్రిప్టులో లోపాలేవైనా ఉంటే చిరు కొన్ని సూచనలు చేస్తారు. అవన్నీ అనుభవ పూర్వకంగా చేసేవే.

బన్ని:

బన్ని ముందు కథ వింటాడు. తర్వాత తండ్రి, స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌తో చర్చిస్తాడు. ఇద్దరూ కలిసి కథని ఫైనలైజ్‌ చేయాల్సిందే. లేదా కథలో మార్పు చేర్పులేవైనా ఉంటే తన పరిజ్ఞానంతో అరవింద్‌ సూచనలు చేస్తుంటారు.

మహేష్‌:

ప్రిన్స్‌ మహేష్‌ కథల ఎంపిక స్వయంగానే చేసుకుంటాడు. అయితే అతడి సినిమా ఎలా ఉంటుందో రివ్యూ మాత్రం సూపర్‌స్టార్‌ కృష్ణ చెబుతారు. అతడి సినిమాలు సాధిస్తున్న అసలు వసూళ్లేంటనేది కృష్ణ గారు గణాంకాలతో సహా చెబుతారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలో లెక్కలు కరెక్టుగా చెప్పారాయన. అసలు మహేష్‌ని నటుడిని చేయాలన్న ఆలోచన కృష్ణదే. అది పెద్ద సక్సెసైంది.

రానా:

యువహీరో రానా ఏ కథ అయినా ఓకే చెయ్యాలంటే తను విన్న తర్వాత తండ్రి, అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు వినాల్సిందే. కథ, బడ్జెట్‌ తదితర విషయాలపైనా ఈ ఇద్దరూ చర్చించుకుంటారు.

వెంకటేష్‌:

నిర్మాత రామానాయుడు వల్లే వెంకటేష్‌ అనే హీరో, సురేష్‌బాబు అనే నిర్మాత ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!! ఇద్దరు ఆణిముత్యాల్లాంటి బిడ్డల్ని ప్రణాళికాబద్ధంగా పెంచిన గొప్ప తండ్రి ఆయన. అందుకే ఒక పెద్ద హీరోని, ఒక పెద్ద నిర్మాతని పరిశ్రమకి అందించారు. ఇటీవలే నాయుడుగారు కాలం చేశారు. అయితే అన్నయ్య సురేష్‌బాబుతో చర్చించనిదే వెంకీ ఏ ప్రాజెక్టును ముందుకు నడిపించరు. అలాగే వెంకీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది అన్నయ్య సురేష్‌బాబే అని చెబుతుంటారు.  తండ్రి తర్వాత తండ్రి అంతటివాని చేతిలో వెంకీ చెయ్యి ఉంది.

నితిన్‌:

వరుసగా 16 పరాజయాలు వచ్చినా ఇంకా హీరోగా కొనసాగుతున్నాడంటే నితిన్‌ వెనుక ఉన్న ఏకైక బలం తండ్రి, అగ్ర నిర్మాత, పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి. నితిన్‌కి కథ చెబితే సరిపోదు.. ముందు సుధాకర్‌రెడ్డిని ఒప్పించాలి. ఆయనకి ఓ పట్టాన ఏ కథా నచ్చదు. నచ్చితే వదిలిపెట్టడు అలా ఉంటుంది వ్యవహారం.
Tags:    

Similar News