టాప్-10: అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలు..!

Update: 2022-04-06 14:30 GMT
భారతీయ సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. భాషతో సంబంధం లేకుండా హాలీవుడ్ సినిమాలకు పోటీగా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంటున్నాయి. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలను తీసుకుంటే అందులో మూడు టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించినవే కావడం విశేషం.

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ చిత్రం. కానీ తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అని దర్శకధీరుడు జక్కన్న చాటిచెప్పారు. మన సినిమాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. కలెక్షన్స్ లో బాలీవుడ్ సినిమాలే కాదు హాలీవుడ్ చిత్రాలను సైతం బీట్ చేస్తున్నాయి.

'బాహుబలి' సినిమాలతో సత్తా చాటిన రాజమౌళి.. ఇప్పుడు RRR చిత్రంతో మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్నారు. రెండు వారాల్లోనే 1000 కోట్ల మార్క్ ని అందుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాని పరిశీలిద్దాం..!

1. 'దంగల్' : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 2016 డిసెంబర్ 23న విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2024 కోట్లు వసూలు చేసింది. చైనాలో రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ చేసింది.

2. 'బాహుబలి - ది కన్క్లూజన్' : టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ సినిమా 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1810 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రెండో భారతీయ సినిమాగా నిలిచింది.

3.'RRR' : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన సినిమా ఇది. అజయ్ దేవగన్ - అలియా భట్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా 2022 మార్చి 25న విడుదలైంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ. 920 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. 1000 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

4. 'భజరంగీ భాయిజాన్' : సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 2015 జులై 17న విడుదలైంది. సల్మాన్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మన దేశంలో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. మూడేళ్ల తర్వాత చైనాలో రిలీజ్ కాబడి మరో రూ. 400+ కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఓవరాల్ గా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద నాలుగో స్థానంలో నిలిచింది.

5. 'సీక్రెట్ సూపర్ స్టార్': అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించిన ఈ సినిమాలో జాయిరా వాసిమ్ ప్రధాన పాత్ర పోషించింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్ తన హోమ్ బ్యానర్ లో నిర్మించారు. 2017 అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ మన దేశంలో కంటే చైనాలో అధిక వసూళ్ళు రాబట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 831 కకోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

6.'PK' : అమీర్ ఖాన్ - అనుష్క శర్మ - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఇది. 2014 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదలైన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాని - వినోద్ చోప్రా కలిసి నిర్మించారు. చైనాలోనూ అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ రూ. 741 కోట్లతో అప్పటికి హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.

7. 'రోబో 2.0' : సూపర్ స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. 'రోబో' చిత్రానికి సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 నవంబర్ 29న విడుదలైంది. లైఫ్ టైం రన్ లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 709 కోట్లు వసూలు చేసింది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ఈ సినిమా చాలా ఏరియాలలో నష్టాలనే మిగిల్చింది.

8. 'బాహుబలి - ది బిగినింగ్' : ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఇది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమా 2015 జులై 10న విడుదల కాబడింది. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన 'బాహుబలి 1'.. నార్త్ మార్కెట్ లోనూ భారీ వసూళ్లు అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది.

9. 'సుల్తాన్' : సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన సినిమా ఇది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా 2016 జూలై 6న థియేటర్లలోకి వచ్చింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 615 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో చేరింది.

10. 'సంజు' : రణబీర్ కపూర్ టైటిల్ రోల్ లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా - రాజ్ కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మించారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 582 వసూళ్ళు రాబట్టింది.
Tags:    

Similar News